
మూడో డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ – ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు
మూడో డిస్కం ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మూడవ డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ) ఏర్పాటు ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఇంధన శాఖ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) ఆధారంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరుకు లేదా తదుపరి నెలల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 29 లక్షల సేవలు – ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బి), మున్సిపల్ వాటర్ సప్లై వంటివి – కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. ఇందులో 29,05,779 వ్యవసాయ కనెక్షన్లు, 489 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 1,132 మిషన్ భగీరథ పథకాలు, 639 మున్సిపల్ వాటర్ సప్లై కనెక్షన్లు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా ఉచిత విద్యుత్ పథకాలు, సబ్సిడీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మూడో డిస్కం కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించబడింది. దీని కోసం సుమారు 2,000 మంది ఇంజినీర్లు, సిబ్బందిని ప్రస్తుత డిస్కంల నుండి (TGSPDCL, TGNPDCL) బదిలీ చేసే ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త డిస్కం రాష్ట్రవ్యాప్తంగా పరిధిని కలిగి ఉంటుంది. ఆస్తుల ముఖ విలువ రూ.4,929 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే, బాధ్యతలు (లయబిలిటీస్) ఆస్తుల కంటే ఏడు రెట్లు ఎక్కువగా – సుమారు రూ.35,982 కోట్లు – ఉండటం గమనార్హం. ఇందులో రూ.9,032 కోట్ల రుణాలు (ప్రభుత్వ గ్యారెంటీలతో), రూ.26,950 కోట్ల జనరేటర్ బకాయిలు ఉన్నాయి.
ముషారఫ్ ఫరూఖి సీఎండీగా నియామకం
మూడో డిస్కం స్థాపనకు కీలకమైన బాధ్యతను తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) సీఎండీగా విజయవంతంగా పనిచేస్తున్న శ్రీ ముషారఫ్ అలీ ఫరూఖి, ఐఏఎస్ అధికారికి అప్పగించింది ప్రభుత్వం. TGSPDCLలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఈయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిగింది.
TGSPDCLలో ముషారఫ్ ఫరూఖి సాధించిన సంస్కరణలు
డిసెంబర్ 2023లో TGSPDCL సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫరూఖి గారు విద్యుత్ సేవల మెరుగుదలకు పలు కీలక చర్యలు చేపట్టారు:
- క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (విద్యుత్ అంబులెన్స్‌లు): విద్యుత్ అంతరాయాలపై తక్షణ స్పందన కోసం ప్రత్యేక వాహనాలను ప్రవేశపెట్టారు.
- ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్: రియల్ టైమ్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించే సాంకేతిక వ్యవస్థ అమలు చేశారు. దూర ప్రాంతాల్లో కూడా సమస్యలను తక్షణం గుర్తించే సౌలభ్యం కల్పించింది.
- ‘కరెంటోళ్ల ప్రజా బాట’ కార్యక్రమం: ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులు బస్తీలు, కాలనీలు సందర్శిస్తూ నెట్‌వర్క్ సమీక్షలు చేసి లోపాలను సరిదిద్దే విధానం అమలు చేస్తున్నారు.
అవినీతి నిర్మూలనకు కట్టుబాటు
వినియోగదారులకు పారదర్శక, అవినీతిరహిత సేవలు అందించేందుకు సీఎండీ కార్యాలయంలో యాంటీ బ్రైబరీ సెల్ (ABC) ఏర్పాటు చేశారు. ఈ సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల 8 మంది అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, హై కెపాసిటీ కనెక్షన్ల జారీలో అంచనా వ్యయాల పేరిట జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు యూనిఫామ్ కనెక్షన్ విధానాన్ని అమలు చేశారు.
రాష్ట్ర విద్యుత్ రంగంలో గత రెండేళ్లుగా రూపొందించిన పాలసీలు, ముఖ్య నిర్ణయాల్లో శ్రీ ముషారఫ్ ఫరూఖి కీలక పాత్ర పోషించారు. మూడో డిస్కం ఏర్పాటుతో రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
