
- నర్మెట్ట నుంచి విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆదివారం చర్చించారు.

మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు. తర్వాత మరో 20 రోజులకు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగతా నిధులు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిరూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.

సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
