పశ్చిమాసియా యుద్ధం సంక్షోభంతో  అల్లాడుతున్న భారతం

హార్ముజ్ జలసంధి సంక్షోభం

భారత్‌లో ఇంధన సమస్య తీవ్రం.. పెట్రోల్ , ఎల్‌పీజీ కొరతతో ప్రజలకు తప్పని పాట్లు

వైష్ణవీ మరిపాల

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతదేశ సామాన్య జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ మరణించడంతో ప్రతీకార చర్యలు ఉధృతమయ్యాయి. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో సౌదీ అరేబియా ఆరామ్‌కో రనూరా రిఫైనరీ, యూఏఈ అడ్నాక్ పుజైరా, ఖతార్ రస్‌లా ఫోన్ ఎల్‌ఎన్‌జీ కేంద్రాలు, ఇరాక్, కువైట్ చమురు క్షేత్రాలపై దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంత ఉత్పత్తి స్తంభించింది. దీని ప్రభావం హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అంతా జీరో స్థాయికి పడిపోయింది.

హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం భాగం తీసుకువెళ్తుంది. ఇండియా మొత్తం ముడి చమురు అవసరాలలో 88.6 శాతం విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇందులో 40-50 శాతం హార్ముజ్ మార్గం ద్వారా సౌదీ, ఇరాక్, యూఏఈ, కువైట్ నుంచి వస్తుంది. వంటగ్యాస్ (ఎల్‌పీజీ)లో 80 శాతం, ఎల్‌ఎన్‌జీలో సగం ఈ మార్గమే. యుద్ధం మొదలైన తర్వాత ట్యాంకర్ల రాకపోకలు దాదాపు స్తంభించాయి. 150కి పైగా నౌకలు తీరానికి దూరంగా లంగరు వేసి ఉన్నాయి. బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద రద్దు నోటీసులు జారీ చేయడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

క్షేత్రస్థాయి పరిస్థితి గందరగోళం:
ప్రజల భయాందోళనలతో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద భారీ క్యూలు పెరిగి పోయాయి. కొన్ని పంపులు నిల్వలు ఖాళీ అయి మూతపడుతున్నాయి. క్యాబ్, ఆటో డ్రైవర్లు ట్రిప్పులు రద్దు చేసుకుంటున్నారు. వంటగ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు, రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ఆసుపత్రులు జనరేటర్ల కోసం ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో వాడుతున్నాయి. మార్చి నెలలో చమురు దిగుమతులు 23 శాతం తగ్గాయి.

ధరలు ఆకాశాన్నంటుతున్నాయి:
బ్రెంట్ క్రూడ్ ధర మార్చి 27న $114.81కి చేరుకుంది. గత నెలలో 47 శాతం పెరిగింది. భారత్‌లో కొన్ని రకాల పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే పెరిగాయి. రవాణా, ఆహారం, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ఎగుమతుల్లో 17 శాతం గల్ఫ్ దేశాలు తీసుకుంటున్నాయి. యూఏఈ, సౌదీ హబ్‌ల ద్వారా సరఫరాలు జాప్యం, రవాణా ఛార్జీలు రెట్టింపు అవడంతో చిన్న, మధ్యతరహా ఎగుమతిదారులు సతమతమవుతున్నారు.

ప్రభుత్వం చర్యలు, ఆశావాదం:
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిల్వలు (సుమారు 10 కోట్ల బ్యారెళ్లు)ను సక్రమంగా వినియోగిస్తోంది. ఇవి రెండు నెలల వరకు ఆసరా ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. రష్యా, అమెరికా, బ్రెజిల్, పశ్చిమాఫ్రికా నుంచి ప్రత్యామ్నాయ సరఫరాలు పెంచుతున్నాయి. అమెరికా మినహాయింపులతో రష్యా చమురు రాయితీపై వస్తోంది. దౌత్య ప్రయత్నాలతో ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఇటీవల రెండు ఇండియన్ ఎల్‌పీజీ ట్యాంకర్లు హార్ముజ్ దాటి వచ్చాయి. మరిన్ని 22 నౌకలను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీర్ఘకాలిక పాఠం:
ఈ సంక్షోభం భారత్ ఇంధన బలహీనతను మరోసారి బయటపెట్టింది. ఇంధన దిగుమతులపై అధిక ఆధారపడటం, హార్ముజ్‌పై అత్యధిక ఆధారం – ఇవి భవిష్యత్ సవాళ్లు. వ్యూహాత్మక నిల్వలను మరింత పెంచాలని, ప్రత్యామ్నాయ మార్గాలు (కేప్ ఆఫ్ గుడ్ హోప్ వంటివి), పునరుత్పాదక ఇంధనాలు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధవిరమణ కోసం ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలని భారత్ పిలుపునిచ్చింది.

ఈ భౌగోళిక రాజకీయాల ధరను సామాన్యులు చెల్లిస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు లోను కాకుండా, ప్రభుత్వం చెప్పినట్లు ప్రశాంతంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆశావాదం వ్యక్తమవుతోంది… కానీ ఇంధన స్వావలంబన దిశగా దీర్ఘకాలిక చర్యలు తప్పనిసరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text