
– అన్నప్రసాద పంపిణీ
– యమునోత్రి ధామ్‌లో ప్రత్యేక పూజలు
– బద్రీనాథ్‌లో శ్రీమద్ భాగవత మహాకథ నిర్వహించాం
నమో వందే గోమాతనం జాతీయ అధ్యక్షుడు పెరిక సురేష్
హైదరాబాద్: యమునా పుష్కరాలు–2026 సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ధామ్‌లో ఘనంగా మహాయజ్ఞం నిర్వహించి, వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు నమో వందే గోమాతరం జాతీయ అధ్యక్షుడు పెరిక సురేష్ తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే యమునా పుష్కరాల్లో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వామీజీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.


యమునోత్రి ధామ్‌లో నిర్వహించిన మహాయజ్ఞంతో పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు. పుష్కర స్నానం, దానధర్మాలు, ప్రత్యేక ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక శుద్ధితో పాటు ప్రకృతితో సమన్వయం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. యమునా పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సానుకూల ఆలోచనలను ప్రసాదించే దివ్యమైన సందర్భంగా అభివర్ణించారు.


ఇదే సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రం బద్రీనాథ్ ధామ్ లో నిర్వహించిన శ్రీమద్ భాగవత మహాకథ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. 11 రోజులపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ప్రతిరోజూ భాగవత ప్రవచనాలు, ప్రత్యేక పూజలు, హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచితంగా ప్రత్యేక వసతి, దర్శన ఏర్పాట్లు, అన్నదాన కార్యక్రమాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేలాది మంది భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాదం పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించామని పెరిక సురేష్ వెల్లడించారు.


