
హైదరాబాద్, జూన్ 29: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సభ్యుడు పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు సోమవారం పవిత్ర ఖడ్గం (కడ్గం)ను బహూకరించినట్లు ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రీ ధామ్, కేదార్‌నాథ్ ధామ్‌లో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ పవిత్ర ఖడ్గాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి, కొప్పు బాషా తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ, ధర్మానికి ప్రతీకగా భావించే పవిత్ర ఖడ్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి అందించడం శుభపరిణామాలకు నాంది పలుకుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతోందని, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
మిషన్ 2026–27లో భాగంగా తెలంగాణలోని ప్రతి నగరంలో మేయర్ పదవులను, ప్రతి మున్సిపాలిటీలో చైర్మన్ పదవులను బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. సంకల్పం నుంచి విజయానికి బీజేపీ సిద్ధంగా ఉందని, తెలంగాణలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
