
హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్ : గ్రీనరీ ప్రియులకు
20వ గ్రాండ్ నర్సరీ మేళా అందుబాటులోకి వస్తోంది. ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోగా నిర్వహించే ఈ మేళా ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో, ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలో జరగనుందనీ నర్సరీ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు.
మేళాలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కలు, నర్సరీ మొక్కలు, వివిధ రకాల కుండీలు, కంపోస్ట్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి.
ఇంటివద్ద, బాల్కనీలు, టెర్రస్ గార్డెన్లలో మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి మేళా ఉపయోగకరంగా ఉండనుంది. పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్లు, సక్యూలెంట్స్, పండ్ల మొక్కలు తదితరాలను ఒకే వేదికపై కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు.
మొక్కల పెంపకం, ఉద్యానవనం, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రజలు మేళాను సందర్శించాలని నర్సరీ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ కోరారు.
