
ధరణి అక్రమాలపై సిట్
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
వర్షాభావంపై కేంద్రానికి లేఖ.. ధరణి అక్రమాలపై సిట్
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేబినెట్ ఆదేశం
మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్టెడ్ సభ్యత్వం.. గ్రామపంచాయతీ నిధుల నిర్వహణలో మార్పులు*
హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందాన్ని పంపడంతో పాటు ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని నిర్ణయించారు.
రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రణాళిక మండలి వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక నివేదిక రూపొందించాలని నిర్ణయించింది. ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది.

ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. 2020 అక్టోబర్ 29 నుంచి జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, ప్రభుత్వ, అసైన్డ్ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను విచారించాలని నిర్ణయించింది.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, భూముల వర్గీకరణ మార్పులు, అధికారుల అనుమతులను పరిశీలించనున్నారు. ధరణి నిర్వహణలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, సాఫ్ట్‌వేర్ రూపకల్పన, డేటా భద్రతలో లోపాలపై కూడా విచారణ జరపాలని నిర్ణయించారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్ పనులకు యూనిఫైడ్ విధానం
ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో వ్యయ నియంత్రణ, పారదర్శకత కోసం ప్రాజెక్టుల రూపకల్పన నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ఏకీకృత విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది.
ఇతర కీలక నిర్ణయాలు
మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 సవరణకు ఆమోదం తెలిపింది. గ్రామపంచాయతీ నిధులను ట్రెజరీతో పాటు జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైలకు ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల వివరాలను కేబినెట్ పరిశీలించింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అలాగే ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసి గోదావరి జలాలతో మంథని నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
