
బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు
హైదరాబాద్, ఆగస్టు 22:
పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీకి ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం 20వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో నిర్వహిస్తున్న హార్టీకల్చర్షో బ్రోచర్ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్షోను ఈనెల 27 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెడిసినల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఔట్డోర్ ప్లాంట్స్, పూల మొక్కలు, పండ్ల మొక్కలు తదితర అన్ని రకాల హార్టీకల్చర్ ఉత్పత్తులను ఒకే వేదికపై కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మేళా అందుబాటులో ఉంటుందని నర్సరీ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కలు, నర్సరీ మొక్కలు, వివిధ రకాల కుండీలు, కంపోస్ట్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటివద్ద, బాల్కనీలు, టెర్రస్ గార్డెన్లలో మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి మేళా ఉపయోగకరంగా ఉండనుంది. మొక్కల పెంపకం, ఉద్యానవనం, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రజలు మేళాను సందర్శించాలని నర్సరీ మేళా ఖాలీద్ అహ్మద్ కోరారు.
ఫోటో..20వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రంలో జాహెద్ అహ్మద్
