
తిరుమలలో వన్యప్రాణుల నిఘాకు రోబోట్ డాగ్
తిరుమల, ఆగస్టు 20: తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా క్వాడ్రుపెడ్ రోబోట్ (రోబోట్ డాగ్) పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
పద్మావతి అతిథి గృహం వద్ద నిర్వహించిన పరిశీలనలో.. మనుషులు వెళ్లేందుకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉండే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు రోబోట్‌ను వినియోగించే అవకాశాలను అధికారులు పరిశీలించారు. ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికత ఈ రోబోట్‌లో ఉన్నట్లు తెలిపారు.

చీకటి, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే సామర్థ్యం రోబోట్‌కు ఉంటుందని వివరించారు. పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను ఏఐ ఆధారంగా గుర్తించి వర్గీకరించడంతోపాటు.. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే జియో-ట్యాగ్డ్ అలర్ట్‌లు, లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించే అవకాశాలను పరిశీలించారు.

చిరుతల కదలికలపై ప్రత్యేక నిఘా
ముఖ్యంగా అలిపిరి–తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
వన్యప్రాణులు భక్తుల రాకపోకల ప్రాంతాల వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను వినియోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించారు.

మానిటరింగ్ వ్యవస్థకు అదనపు బలం
ఇప్పటికే అమల్లో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘాకు ప్రత్యామ్నాయంగా కాకుండా వాటికి అదనంగా మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా రోబోట్‌ను వినియోగించే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల కదలికలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో దీనిని వేగంగా మోహరించవచ్చని అధికారులు తెలిపారు.
రోబోట్ ద్వారా సేకరించే వీడియో, థర్మల్ చిత్రాలు, వన్యప్రాణుల కదలికల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి సంచార తీరును మరింత సమర్థవంతంగా అర్థం చేసుకుని, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్, నిఘాను మెరుగుపరిచే అవకాశం ఉంటుందని టీటీడీ పేర్కొంది.
