రూ.5 కోట్ల ఇంప్లాంట్ల నిల్వలు.. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు
ఆరోగ్యశ్రీ బిల్లింగ్‌లో అక్రమాలు.. ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజుల వినియోగం

నిమ్స్‌లో అక్రమాల కలకలం.. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వలు!

మూడు నెలల క్రితమే చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు.. 

మ్యాన్‌పవర్, క్యాంటీన్, మెడికల్ షాపులు, సెక్యూరిటీ టెండర్లలోనూ అవకతవకలు నిమ్స్‌లో ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)లో చోటుచేసుకున్న పలు అక్రమాలు, అవకతవకలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వెల్లడించారు. నిమ్స్‌లో గత నెల 29, ఈ నెల 2వ తేదీల్లో ఏసీబీ అధికారులు, టీజీ సేఫ్‌ (ఆహార భద్రత), డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం, కార్మిక శాఖ ప్రత్యేక బృందాలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మ్యాన్‌పవర్‌ నియామకాలు, క్యాంటీన్‌ నిర్వహణ, మెడికల్‌ షాపులు, సెక్యూరిటీ సర్వీసులు, ఆపరేషన్‌ థియేటర్లు, బిల్లుల చెల్లింపులు, శస్త్రచికిత్సల వినియోగ వస్తువులకు సంబంధించి పలు అక్రమాలను గుర్తించినట్లు ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు నిల్వ

నిమ్స్‌లోని ఐదు ఆపరేషన్‌ థియేటర్లను తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను సరఫరాదారులు ఆపరేషన్‌ థియేటర్ల సమీపంలోని అల్మారాలు, ఓటీ సబ్‌స్టోర్లలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది వాటిని అక్కడే ఉంచేందుకు అనుమతించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. మెయిన్‌ స్టోర్‌ నుంచి ఇండెంట్‌ (అధికారిక అభ్యర్థన) లేకుండానే వైద్యులు సరఫరాదారుల నుంచి నేరుగా ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్‌ జారీ చేసి, సరఫరాదారుల ఇన్వాయిస్‌ల ఆధారంగా బిల్లులు ప్రాసెస్‌ చేస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు సైతం యుటిలిటీ సర్టిఫికెట్లు సృష్టించి బిల్లులు పొందే అవకాశం ఉందని, సరఫరాదారులతో కుమ్మక్కయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు పేర్కొంది.

చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు!

నిమ్స్‌లో బిల్లుల ప్రాసెసింగ్‌లోనూ తీవ్రమైన అక్రమాలను ఏసీబీ గుర్తించింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించిన బిల్లులను వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ప్రాసెస్‌ చేసినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా వారి పేర్లతో బిల్లులు రూపొందించినట్లు వెల్లడించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రోగులు డిశ్చార్జి అయిన తర్వాత సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లింగ్‌ ఎంట్రీలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.

ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులు!

శస్త్రచికిత్సలకు ఉపయోగించే వైద్య వినియోగ వస్తువుల వినియోగంలోనూ అసాధారణ పరిస్థితులను గుర్తించారు. ఒక రోగికి కేవలం వారం రోజుల్లోనే 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో నమోదైందని ఏసీబీ వెల్లడించింది. ఇలాంటి అవకతవకల్లో అధిక శాతం ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రిలో చేరిన రోగులకు సంబంధించినవేనని పేర్కొంది.

ఇతర విభాగాల్లోనూ అక్రమాలు

మ్యాన్‌పవర్‌ సేవలకు సంబంధించి 2019 నుంచి 2025 వరకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయకుండానే కార్యకలాపాలు కొనసాగించినట్లు గుర్తించారు. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్‌ కేటగిరీకి మార్చే విషయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు, నియామకాల్లో కుమ్మక్కు వ్యవహారాలకు అవకాశాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రధాన క్యాంటీన్‌లో అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహణ సాగుతున్నట్లు గుర్తించారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్యాంటీన్‌ టెండర్లలోనూ అక్రమాలు, బిడ్డర్ల మధ్య కుమ్మక్కు వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మెడికల్‌ షాపుల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులు అందుబాటులో లేకపోవడం, రిజిస్ట్రేషన్‌ లేని సిబ్బందితో పనిచేయించడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. మెడికల్‌ షాపుల కేటాయింపునకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

సెక్యూరిటీ సర్వీసుల టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం, ఒప్పందాల గడువును పదేపదే పొడిగించినట్లు గుర్తించారు. డిఫాల్ట్‌ అయిన ఓ ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్‌ గ్యారంటీని సైతం జప్తు చేయలేదని ఏసీబీ వెల్లడించింది.

రికార్డులు స్వాధీనం.. తదుపరి విచారణ

తనిఖీల సందర్భంగా పలు కీలకమైన నోట్‌ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర సంబంధిత రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగులోకి వచ్చిన ఆరోపణలను మరింత లోతుగా పరిశీలించి, వాటి వాస్తవాలను నిర్ధారించేందుకు తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ప్రభుత్వ వైద్య సంస్థలో రోగులకు అందాల్సిన వైద్య సేవలు, ప్రజాధనం వినియోగం, ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల చెల్లింపుల్లో వెలుగుచూసిన ఈ పరిణామాలు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text