
రైతుల ఖాతాలలో నిధుల జమ
70లక్షల మంది రైతులు అర్హులుగా తేల్చిన వ్యవసాయశాఖ
పెరగనున్న 5 లక్షల కొత్త లబ్దిదారులు
4 లక్షల ఎకరాలకు పోడు సాయం
కోటి 54లక్షల ఎకరాలకు అందనున్న రైతుబంధు
ఈ సీజన్‌కు రూ.7720.29 కోట్లు పంపిణీ
హైదరాబాద్, జూన్ 25
రాష్ట్రంలోని రైతాంగానికి సోమవారం నుంచి రైతుబంధు నిధులు అందనున్నాయి. సీసీఎల్‌ఎ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన వివరాలను అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ఖు అందించింది. మొదటి రోజున ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు అందించనున్నారు. ఇలా రోజు వారిగా ఎకరం చొప్పున పెంచుతూ అర్హులైన రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి సర్కారు సర్వం సిద్దం చేసింది.

70 లక్షల రైతులకు పెట్టుబడి సాయం..
రాష్ట్రంలో సీసీఎల్‌లో నమోదైన పట్టాపాస్‌బుక్‌లు కలిగిన 70లక్షల మంది రైతులు ఈవానాకాలం రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని ఒకకోటి 54 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించనున్నారు. ఈ వానాకాలం రైతుబంధు పంపిణీ చేసేందుకు రూ.7720.29 కోట్ల నిధులు అవసరం అవుతాయని అగ్రిలక్చర్ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది.


4లక్షల మంది పోడు రైతులకు అందనున్న సాయం
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాలను రాష్ట్ర సర్కారు కొత్తగా పోడు భూములుగా గుర్తించింది. ఫలితంగా ఈయేడు వానాకాలం లక్షా 50 వేల మంది పోడు రైతులకు రైతు బంధు సాయం అందించనున్నారు. ఫలితంగా నిరుడు వానాకాలం కంటే ఈయేడు అదనంగా మరో రూ.300కోట్లు నిధులను రైతులకు అందించనున్నారు. ఇప్పటికే 10 వ విడతల్లో రూ.65,190 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. తాజాగా విడుదల చేస్తున్న 11వ విడతతో రైతుబంధు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రూ.72,910 కోట్లకు చేరనున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ఎకరానికి పదివేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రంః మంత్రి నిరంజన్‌రెడ్డి
దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న నేపథ్యంలో రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదని స్పష్టం చేశారు.
