
పోడు రైతుల డేటా సేకరణకు జూలై 3 వరకు గడువు
కొత్తగా పోడు పట్టా భూములు 4.26లక్షల ఎకరాలు
లక్షన్నర మంది పోడు రైతులుగా గుర్తింపు
రూ.213.89కోట్ల పెట్టుబడి సాయం
అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్
అత్యల్పంగా పెద్దపల్లి, నారాయణపేట్
ట్రైబల్ వెల్‌ఫేర్ నుంచి కొత్త పోడు పట్టాల డేటా సేకరణ
రైతుబంధు పోర్టల్‌లో ఏఈవోలకు లాగిన్
గడువులోగా వివరాల అప్‌లోడ్

హైదరాబాద్, జూన్ 27
రాష్ట్రంలోని 26జిల్లాలకు చెందిన పోడు సాగు చేసుకుంటున్న హక్కుదారులకు కొత్తగా రైతుబంధు అందించేందుకు సర్కారు సిద్ధమైంది. పోడు రైతుల బ్యాంకు వివరాలు రైతుబంధు కోసం జూలై 3 వరకు నమోదుకు అవకాశం కల్పిస్తూ వ్యవసాయశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పోడు రైతుల భూములు, రైతులకు సంబంధించి డేటా రైతు బంధు పోర్టల్ లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వివరాలు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (ఏఈవో)ల లాగిన్లలో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ అందించిన వివరాల ప్రకారం ఎంతమందికి, ఎంత పోడు భూములు ఉన్నాయనే డేటాను వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధికారులకు అందించింది. దీనికి అనుగుణంగా జిల్లా, మండల స్థాయి, క్షేత్రస్థాయి అధికారుల బృందాలు రైతుల బ్యాంకు వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ సేకరించిన బ్యాంకు వివరాలన్నీ జూలై 3వ తేదీలోపు రైతుబంధు పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.

కొత్తగా లక్షన్న మంది రైతులకు పోడు పట్టాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 4.26 లక్షల ఎకరాలను కొత్తగా పోడు పట్టా భూములు సాగులో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోడు భూములు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని లక్షన్నర మంది పోడు రైతుల పట్టా భూములు వారి ఆధీనంలో ఉన్నట్లు అధికారికంగా తేల్చింది. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.59 లక్షల ఎకరాల్లో పోడు పట్టా భూమి 50వేల మంది పోడు రైతుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ తరువాత మహబూబాబాద్ జిల్లాలో 75,132 ఎకరాల పోడు భూములు దాదాపు 25వేల పోడు రైతుల ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. అత్యంత తక్కువగా పెద్దపల్లి జిల్లాలో రెండు ఎకరాలకు చెందిన నలుగురు రైతులకు పోడు సాగులో ఉన్నది. నారాయణపేట జిల్లాలో ముగ్గురు పోడు రైతుల చేతిలో 8ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 19మంది రైతుల చేతిలో 13 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 15మందిరైతుల చేతిలో 19 ఎకరాల పోడు పట్టా భూమి సాగులో ఉన్నట్లు సర్కారు అధికారికంగా గుర్తించింది.

పోడు రైతులకు పెట్టుబడి సాయం రూ.213.89కోట్లు ..
ప్రభుత్వం తాజాగా గుర్తించిన 4.26లక్షల ఎకరాల పోడు భూమి లక్షన్నర మంది రైతుల ఆధీనంలో ఉన్న రైతులను గుర్తించింది. వారికి రైతుబంధు అందించేందుకు బ్యాంకు వివరాలను అప్‌లోడ్ చేయనుంది. ఫలితంగా ఈయేడు కొత్తగా లక్షన్నర మంది పోడు రైతులకు సంబంధించి పోడు పట్టా భూములకు రైతుబంధు సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.213.89కోట్లు నిధులను లక్షన్నర మంది రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.