
స్ఫూర్తి నింపిన వీరుని మరణం….
ఉద్యమాలను రగిల్చిన వీరుని చరిత
ఉద్యమాల పురిటి గడ్డ కడవెండి
కడవెండి ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య
నేడు దొడ్డి కొమరయ్య 77వ వర్థంతి
‘‘అమరజీవివి నీవు కొమరయ్యా..! అందుకో జోహార్లు కొమరయ్యా..!!’’ అంటూ కడవెండి రణభూమి ఇప్పటికీ కణకణ మండుతునే ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరమరణం చెందిన కడవెండి వీరపుత్రుడు దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగం ఎన్నో గడీలను కూల్చింది. ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి మొదలుకొని నిన్నమొన్నటి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి దాకా కడవెండి అమరత్వం అనేక గ్రామాల బానిస సంకెళ్లను తెంచింది. మరెన్నో ప్రజా ఉద్యమాలకు దివిటీగా నిలిచింది. తెలంగాణ రైతాంగ ఉద్యమానికీ, ఆ తర్వాత అనేక ప్రజాఉద్యమాలకూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకూ దొడ్డి కొమరయ్య పోరాట వారసత్వమే స్ఫూర్తి. అదే స్ఫూర్తిగా రాష్ట్రం నిర్మాణం, పునర్నిర్మాణం సాగాలని మలిదశ ఉద్యమ నాయకులు అనేక వేదికల మీద ఢంకా బజాయించారు. ఉప్పెనలా ఉద్యమాగ్నిని రగిలించారు. మహోధ్యమాన్ని సాగించి ప్రత్యేక రాష్ట్రం సాధించారు.
విస్నూర్ దేశ్ ముఖ్ ఆగడాలు…
ఆనాటి నల్లగొండ జిల్లా పరిధిలోని జనగామ ప్రాంతం విస్నూరు దేశముఖ్ రాపాక రామంచంద్రారెడ్డి ఆగడాలతో అట్టుడుకింది. మెడలు వంచే పన్నులు, నడుములు వంచే వెట్టిచాకిరీ, నడ్డి విరిచే వడ్డీలు, చక్రవడ్డీల దోపిడీ కింద ప్రజలు నలిగిపోయేవారు. ఊర్లు ఊసురోమన్నాయి. ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా అరాచకమే. తాత ముత్తాతల కాలం నుంచి ఇదే వేదన. దొరల కాళ్ల దగ్గర ప్రజలు బానిసలుగా బతకాల్సిందే. ఎదురు తిరిగితే మరణశాసనమే. దేశముఖ్ దొరల ఆగడాలను ఎదురించి బతికినవారే లేరు. దొర చెప్పిందే వేదం. దొర పలికిందే సత్యం.
భూములన్నీ నిజాం ప్రభువులవే. దొరలు, జమీందార్లు పన్ను వసూలుదార్లే. పంటలో నాలుగో వంతు(చౌత్) వసూలు చేసే చౌదర్లు, సర్దేశ్ ముఖి (పంటలో పందో వంతు) వసూలు చేసే దేశ్ ముఖ్ లు నిజాంకు, రజాకార్లకు తొత్తులే. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ కడవెండిని కేంద్రంగా చేసుకొని చుట్టు పక్కల గ్రామాల ప్రజలను హింసించేది. పేదల భూములను ఆక్రమించుకోవడం, కూలీలతో వెట్టిచాకిరి చెయించుకోవడం, ఎదురు తిరిగితే తుదముట్టించడం, మహిళలను అవమానించడం, పన్నుల పేరుతో దోచుకోవడం ఆమెకు నిత్యకృత్యం.
జానమ్మ ఆమె కొడుకు రామచంద్రారెడ్డి అరాచక పాలన నుంచి విముక్తి కోసం అణిచివేతకు గురైన వాళ్లంతా ఒక్కటయ్యారు. బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా తిరుగుబాటు చేశారు. దొరల పెత్తనం సాగదని దిక్కులు పిక్కటిల్లేటట్లు దిక్కులేని జనం నినదించారు. ఆ నినాదాల్లోమారుమోగిన గొంతే దొడ్డి కొమురయ్యది. జనమంతా విముక్తి కోసం పోరుతున్న తరుణంలో వేగుచుక్కై పొడిచారు దొడ్డి కొమరయ్య, ఆయన అన్న దొడ్డి మల్లయ్య. సాహసానికి దొడ్డ పేరు ఈ దొడ్డి సోదరులది.
కులాలపై విస్నూర్ దేశ్ ముఖ్ పెత్తనం...
నిజాం సంస్థానం అంతా చీకటికోణం. గ్రామాల్లో సాగు భూములు, చెరువులు, బావులు అన్నీ దొరలవే. గ్రామం చుట్టూ ఉండే కంచెలు, పెరళ్లు అన్నీ దొరలవే. కదలడానికి, మెదలడానికి ప్రజలకు వీల్లేదు. దొరలకు, పటేలు, పట్వారీలకు, ఉద్యోగులకు రకరకాల వెట్టిచాకిరి చేయాలి. ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గొల్ల కురుమ, గౌండ్లు, ముత్తరాసి, మాల మాదిగ, లంబాడ ఇలా అన్ని కులాలు వారి వారి వృత్తి ప్రకారం వెట్టి చేయాల్సిందే. ధనిక రైతులకు కూడా ఇది తప్పలేదు. ముందు దొరల భూములు సాగు చేసిన తర్వాతే స్వంత భూముల్లోకి వెళ్లాలి.
రకరకాల పన్నులతో పేద ప్రజలను పీడిస్తూ మరింత పేదలను చేసేవారు. కాన్పు అయితే పన్ను, సాన్పు సల్లితే పన్ను, నోరు మూసుకుంటే పన్ను, తెరిస్తే పన్ను, సముర్తాడితే పన్ను, పెండ్లికి పన్ను, తీర్థంబోతే పన్ను, రోలు పన్ను, రోకటిపన్ను, ఆఖరికి చస్తే కూడా పన్ను కట్టాల్సిందే. ఇట్లా పన్ను మీద పన్నుగా అనేక పన్నులను ప్రజల నుంచి జాగీర్దార్లు, దేశముఖులు, పెద్ద భూస్వాములు గుంజేవారు. పన్నులు లేదంటే తన్నులే. ఏదో నెపం పెట్టి ప్రజలను జలగల్లా పీల్చేవారు. దీనికి తోడు అడ్డూ అదుపూ లేకుండా వడ్డీలు, చక్రవడ్డీల దోపిడీ కొనసాగుతుండేది.

పీడిత వర్గాలకు బాసటగా ఆంధ్రమహాసభ..
ఈ పీడనకు వ్యతిరేకంగా పుట్టిందే ఆంధ్రమహాసభ. భువనగిరిలో 1943లో ఆంద్రమహాపభ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో కడవెండిలో దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య, నల్ల నర్సింహులు, దావిద్ రెడ్డి, వడ్డె నర్సయ్య, నల్ల కొండయ్య, మచ్చ రామయ్య, జంపాల లింగయ్య, పంతం లచ్చయ్య, పాముకుంట్ల ముత్తిలింగం, మాశెట్టి రాంచంద్రయ్య, ఎర్రంరెండ్డి మోహన్ రెడ్డి, ఎర్రంరెడ్డి రామకృష్ణారెడ్డి, పైండ్ల యాదగిరి తదితరులు గుతపల సంఘం ఏర్పాటు చేశారు. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఊపిరి పోశారు.
కడవెండి పిలుపుతో గ్రామగ్రామాన గుతపల సంఘాలు వెలిశాయి. వెట్టిచాకిరి, దోపిడీకి, నిర్బంధ వసూళ్లకు, అక్రమ బేదఖళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. జానకమ్మ దొరసాని దాష్టీకాలను అంతం చేసేందుకు పీడిత ప్రజలు ఎర్రజెండా నీడలో ఏకమైనారు. ఆంధ్రమహాసభ స్ఫూర్తితో ఉద్యమ పాఠాలు నేర్చుకున్నారు, బరిసెలు చేతబట్టి దొరల బందూకులు బద్దలు కొట్టారు. దొర ఆగడాలు చెల్లవంటూ విసూనూరు గడీపై దండయాత్ర చేశారు. దొర కిరాయి గూండాల దొంగచాటు దెబ్బకు పలువురు నేలకొరిగారు. అయినా ఎత్తిన జెండా, పట్టిన బరిసె దించలేదు. తల వంచలేదు.
ఈ నేపథ్యంలోనే మొండ్రాయి గ్రామంలో లంబాడి రైతులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి నిజాం తొత్తులైన కటారి రామచందర్రావు సోదరులు రౌడీలతో దాడి చేశారు. ఆ దాడిని లంబాడీలంతా ఏకమై ప్రతిఘటించారు. గూండాలంతా ఒకవైపు నిల్చుంటే, లంబాడీ రైతులు కర్రలు, వడిసెలు, ఎర్రజెండాలు పట్టుకుని మరోవైపు నిలబడ్డారు. చివరికి పోలీసుల సహాయంతో భూమిని గుంజుకున్నారు.

విస్నూర్ దేశ్ముఖ్ పై తిరగబడ్డ చాకలి ఐలమ్మ
మెండ్రాయి గ్రామంలో జరిగిన పోరాటం జరిగిన కొన్నాళ్లకే పాలకుర్తిలో మరో పోరాటం సాగింది. పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ భూమిని విసునూరు దొర దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి దుర్మార్గంగా ఆక్రమించేందుకు పూనుకున్నాడు. అంతకు ముందే ఓ బహిరంగ సభలోనే సంఘం నాయకులను చంపేయాలని గూండాలను పంపించాడు. ప్రజలంతా ఏకమై గుండాల నాయకుడు ఓనమాల వెంకడిని చితకదన్నారు. ఆ సాకుతో పద్నాలుగు మంది సంఘం నాయకులను దేశముఖ్ అరెస్ట్ చేయించాడు. హత్యాచేయించ చూశాడు.
చాకలి ఐలమ్మ పొలంలోని పంట కోసుకురమ్మని వంద మంది నౌకర్లను, మరో వంద మంది గూండాలను పంపించాడు. ఐలమ్మ కొడవలి చేతబట్టి అపర కాళికాదేవిగా తిరగబడింది. సంఘం నాయకులు గుతపలు పట్టుకుని ఐలమ్మకు బాసటగా నిలబడ్డారు. సింహాలై గర్జించి, విసునూరు గుండాలను తరిమారు. గుతపల దెబ్బలకు గూండాలు బతుకు జీవుడా అంటూ పారిపోయారు. సంఘం నాయకులే పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఆ రాత్రే విసునూరు నుంచి దిగిన పోలీసులు, సంఘం నాయకులను చూసి ధాన్యం ముట్టుకోవడానికి సాహసించలేదు.
ఆ మరునాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్లు ప్రతాపరెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి సహా ఆరుగురు యోధులను పోలీసులు అరెస్టు చేశారు. కాళ్లకు, చేతులకు బేడీలు వేసి అర్థరాత్రి కచేరి చావడి వద్ద చితకబాదారు. కండ్లళ్లో కారం జల్లి చిత్ర హింసలు పెట్టారు. అయినా ఐలమ్మ పొలాన్నిగాని, ఆ పొలంలో పండిన పంటను గాని దేశముఖ్ స్వాధీనం చేసుకోలేకపోయాడు. అరవై ఊర్లకు పేరు మోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి పరాభవభారంతో రగిలిపోయాడు.

పోరాటాల పురిటి గడ్డ కడవెండి..
పోలీసుల సహాయంతో కడవెండిలో ఉన్న సంఘం నాయకుల హత్యకు పథకం వేశాడు. పలువురిపై అక్రమకేసులు పెట్టించాడు. గ్రామంలో మరోసారి సంఘం కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవాలని భావించాడు. కేసులతో భయపెట్టి హత్యాపథకాలకు కుట్రపన్నాడు. పోలీసులు, జమీందారులు, గూండాలు కలిసి అనేక కుట్రలకు ఆజ్యం పోశారు.
కండవెండి పోరాటం క్రమంగా దేవరుప్పుల పక్కనే ఉన్న ధర్మాపురం తండాకు పాకింది. దొరల ఉక్కుపాదం కింద నలిగిపోయిన లంబాడీలు ఎదురు తిరిగి, రజాకార్ల శిబిరాలను తగలబెట్టారు. అయినా లంబాడాల సాగుభూమి ఆక్రమించడానికి ధర్మాపురం దొర పుసుకూరి రాఘవరావు దాడులు తీవ్రం చేశాడు. వాస్తవానికి ఈ గ్రామం రామావరం బ్రాహ్మణ దొరల అగ్రహారం. రాఘవరావు మోసపూరితంగా బ్రాహ్మణుల నుంచి గ్రామాన్ని లాక్కున్నాడు. భూమిని ఆక్రమించుకోవడానికి విసునూరు దేశముఖ్‌రాంచంద్రారెడ్డి సహాయంతో రాఘవరావు పెద్ద సంఖ్యలో గూండాలను పోగుచేసి ధర్మాపురం లంబాడాల మీద దాడి చేయించారు. గూండాలను లంబాడాలు విజయవంతంగా తరిమికొట్టారు. ఆ సంఘటన దొరలకు పెద్ద ఓటమిగా భావించారు.
ఆరుట్ల రాంచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ధర్మపురం తండాలో లంబాడాలకు ధైర్యం నూరిపోశారు. లంబాడాలు పెద్దసంఖ్యలో సాయుధ దళాల్లో చేరారు. హామునాయక్ ఆరుగురు కుమారులది దళంలో చురుకైన పాత్ర. ఠానూ నాయక్, సోమ్లా నాయక్, దర్గ్యా నాయక్ దళ కమాండర్‌లుగా పనిచేశారు. దీంతో వారి కుటుంబంపై దొరలు, పోలీసులు, రజాకారులు నిరంతరం దాడులు చేశారు. విసునూరు దేశముఖ్ కొడుకు బాబుదొర పోలీసు, రజాకారులతో వారి తండాపై దాడి చేసి హామునాయక్ చేయి విరగ్గొట్టాడు.
బాబుదొర నాయకత్వంలో పోలీసులు, రజాకారులు పెద్ద ఎత్తున తండాపై దాడిచేసి ఠాను నాయక్ ఆచూకీ చెప్పమని తండా వాసులను చిత్రహింసలు పెట్టారు. ఎంతకీ సమాచారం ఇవ్వకపోవడంతో ఠాను నాయక్ రెండవ అన్న సోమ్లాతో పాటు మరో నలుగురిని తండా మధ్యలో వారితోనే కట్టెలు పేర్పించి సజీవ దహనం చేశాడు. కళ్ళముందే కొడుకు కాలి చచ్చిపోతున్నా ముసలి తల్లిదండ్రులు ఠాను నాయక్ ఆచూకీ మాత్రం చెప్పలేదు. ఠాను తమ్ముడు దర్గ్యాను పోలీసులు నల్ల నర్సింహులుతో పాటు ఒక కుట్ర కేసులో అరెస్టు చేసి ఉరి శిక్ష విధించారు. తర్వాత అది యావజ్జీవ శిక్షగా తగ్గించారు. చివరికి 1953లో సుందరయ్య ప్రయత్నంతో విడుదలయ్యారు. 1950, మార్చి 20న ఠాను నాయక్ మెండ్రాయికి సమీపంలోని నీలిబండ తండలో సైన్యం, పోలీసులకు పట్టుబడ్డాడు. దొర గడీలో అతడిని బండి చక్రానికి కట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వందేళ్ల ముదిమిలో దర్గ్యా నాయక్ ఈనాటికీ ధర్మపురంలో కమ్యూనిస్టుల ధర్మపోరాటాన్ని యువకులకు బిగ్గరగా వినిపిస్తూనే ఉంటారు. తాను గురిచూసి, బాబుదొరను ఎట్లా తుపాకితో కాల్చి చంపింది పూసగుచ్చినట్లు యువకులకు వివరిస్తారు.
వీరుని మరణంతో ప్రజ్వరిల్లిన కడవెండి..
అది 1946 జూలై 4. కడవెండిలో ఒక పెద్ద అలజడి. సంఘం నాయకుల ఇళ్లపై మద్యం మత్తులో గూండాలు రాళ్లు విసురుతూ రాక్షసంగా ప్రవర్తించారు. ఆగ్రహించిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు విసునూరు కిరాయి మూకలపై తిరుగుబడ్డారు. బరిసెలు, గుతపలు అందుకుని దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా కదిలారు.
గొర్రెల కాపరులైన కురుమ సామాజిక వర్గానికి చెందిన దొడ్డి మల్లయ్య అప్పటికే సంఘంలో చురుకైన కార్యకర్త. అతని తమ్ముడు దొడ్డి కొమరయ్యకు జానమ్మ దొరసానిని చూస్తే రక్తం మరిగేది. జానమ్మ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య ముందుండి గ్రామంలో ఊరేగింపు తీశారు. వారి నినాదాలు విని, జానమ్మ ఆమె గూండాల గుండెలు గుబేలుమన్నాయి. గడి నుంచి తన గుమాస్తా మిస్కిన్ అలీతో జానకమ్మ కాల్పులు జరిపించింది. ముందు వరుసలో ఉన్న దొడ్డి మల్లయ్య కాళ్ళకు తూటాలు తగిలి కూలబడ్డాడు. ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన కొమురయ్య గుతప తీసుకుని మిస్కిన్ మీదికి లంఘించాడు. మిస్కిన్ గూండాలు కాల్పుల్లో కొమరయ్య కడుపులో బుల్లెట్లు దిగాయి. పేగులు బయటకు వస్తుండగా ఎడమ చేతితో అదిమిపడుతూ కుడి చేతి పిడికిలి పైకెత్తి నినాదాలు చేస్తూ వీరుడు నేలకొరిగాడు. మరో బుల్లెట్ దొడ్డి మల్లయ్య మోకాలుకు తగిలి కింద పడిపోయారు. మంగలి కొండయ్య నుదుటికి దెబ్బ తగిలింది. అతని సోదరుడు నరసయ్య మోచెయ్యికి గాయం అయింది.
దొడ్డి కొమరయ్య వీర మరణంతో ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అంటూ గడీని చుట్టుముట్టారు. అది చూసి పాకలో ఉన్న దొర గూండాలు కంపించిపోయారు. భయంతో గడీలోకి దూకారు. అప్పటికే ప్రజలంతా ఆ భవనాన్ని చుట్టుముట్టారు. కడవెండి ప్రజలకు తోడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జత కలిశారు. జమీందారు గడీకి నిప్పుబెట్టడానికి గడ్డిని పేర్చారు.
మరికొంత మంది గుతపలు పట్టుకుని ఊరవతల కాపలా కాశారు. ధర్మపురం తండా నుంచి పెద్దసంఖ్యలో లంబాడా యోధులు ఊరేగింపుగా కడవెండి చేరుకున్నారు.
విసునూరు నుంచి రామచంద్రారెడ్డి కొడుకు బాబుదొర కత్తులు కటార్లు, తుపాకులతో రెండు వందల మంది గూండాలను వెంటేసుకొచ్చారు. గ్రామం వెలుపల కాపలా కాస్తున్న ప్రజలు మూకుమ్మడిగా వడిసెలతో రాళ్లు రువ్వారు. గ్రామం పొలిమేర నుంచే మూడు మైళ్లదూరం తరిమికొట్టారు. పాలకుర్తిలో సంఘం నాయకులను చిత్రహింసలు పెట్టిన అనుముల రామిరెడ్డిని దొరకబట్టి చితకదన్నారు.
అమరునికి అంత్యక్రియలు..
దొడ్డి కొమరయ్య భౌతికకాయానికి వేలాది ప్రజల ఊరేగింపు మధ్య అంత్యక్రియలు జరిపారు. జోహార్లు దొడ్డి కొమరయ్య నినాదాలతో జనగామ తాలూకాలో ప్రతీగ్రామం మారుమోగింది. అమరవీరుడిపై పాటలు గట్టి ఊరూవాడా ఉద్యమం లేవదీశారు. కొమరయ్య అమరత్వం రైతాంగంలో నిద్రాణమైన ఆగ్రహాన్ని మేల్కొలిపింది. నల్లగొండ జిల్లా అన్ని తాలూకాల్లోనూ రైతాంగ ఉద్యమం దావానంలా వ్యాపించింది. గ్రామాల్లోని భూస్వాముల గడీల ముందు బహిరంగ సభలు జరిపారు. చివరికి దేశముఖ్ కూడా సంఘం ఉత్తర్వులు అమలు చేయవలసి వచ్చింది. లేదంటే సాంఘిక బహిష్కరణ చేసేవారు.
సంఘం నాయకులు, కార్యకర్తలు తమ చేతుల్లోని గుతపలను బాదుతూ పెద్దపెట్టున నినాదాలు చేసేవారు. గుతపల సప్పుడుతో గ్రామం దద్దరిల్లేది. గుతపల సంఘం వచ్చిందంటేనే భూస్వాముల పంచెలు తడిసిపోయేవి. ఇండ్లల్లోకి దూరి గడియలు పెట్టుకునేవారు. విస్తృత ప్రజా ఉద్యమం వెల్లువతో నిర్బంధ ధాన్యం సేకరణ ఆగిపోయింది. వెట్టిచాకిరి దానంతట అదే అంతమయ్యింది. దేశముఖ్ లు, జమీందార్లు, గ్రామాలు వదిలి వెళ్లాల్సి వచ్చింది.

కొమరయ్య ప్రాణత్యాగం…
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారి తీసింది. కడవెండిలో ప్రారంభమైన ప్రజా ఉద్యమం హైదరాబాద్ సంస్థానం అంతటా వ్యాపించింది. చివరికి నిజాం రాజ్యాన్ని కూకటి వేళ్లతో నేల కూల్చింది. కొమురయ్య ఆత్మబలిదానం స్ఫూర్తిగానే తెలంగాణ తొలి, మలి దశ పోరాటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సుధీర్ఘ ప్రజా ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ సాకారమైంది.
కేవలం దొరలను ధిక్కరించినందుకు ఏ హత్య చేయకపోయినా అనేక మంది యోధులు జైలుశిక్ష అనుభవించారు. కడవెండికే చెందిన అనేక మంది వీరులు నల్లా నర్సింహులు సహా 1959 వరకు జైళ్లలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా దొడ్డి కొమరయ్యను స్మరించుకుంటేనే పాపం అయిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా ఊరూరా దొడ్డి కొమరయ్య సహా అమరుల స్థూపాలు, విగ్రహాలు వెలుస్తున్నందుకు హర్షిద్దాం. తెలంగాణ యోధుల స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం సాగిద్దాం.
దొడ్డి కొమరయ్య
జననం ఏప్రిల్ 3, 1927
మరణం జూలై 4, 1946
తల్లిదండ్రులు
తల్లి : గట్టమ్మ
తండ్రి: కొండయ్య
గ్రామం: కడవెండి
మండలం: దేవరుప్పుల
జిల్లా: జనగామ
రాష్ట్రం: తెలంగాణ