
అమెరికాలో మన బియ్యం కొరత
-బియ్యం ఎగుమతి బ్యాన్ ప్రభావం
-కొనుగోలు కోసం ఎగబడ్డ మనోళ్ళు.
అమెరికాకు బియ్యం ఎగుమతిని భారత్ నిలిపివేసిందన్న వార్త తెలియగానే అమెరికా దేశవ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడింది. ఇక్కడ ఉంటున్న భారతీయులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ వార్త తెలియగానే చాలా మంది భారతీయులు, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ , తెలుగు వారు బియ్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. ఎగుమతి బ్యాన్ అయితే బియ్యం కొరత ఏర్పడుతుందన్న భయంతో చాలామంది భారతీయులు సూపర్ మార్కెట్ లలో ఎగబడి బ్యాగులకొద్దీ బియ్యం కొనుగోలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్ట్ కో, వాల్ మార్ట్ వంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ లలో జనం రద్దీ ఎక్కువగా కనిపించింది.

అమెరికాలో సాధారణంగా బియ్యం బ్యాగ్ 10 కిలోలు ఉంటుంది. ఒక్కొక్కరు ఐదు నుంచి పది బ్యాగులు, కొందరైతే ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం కోసం ఎక్కువ మొత్తంలో బియ్యం బ్యాగులు కొనుగోలు చేశారు.దీంతో అన్ని సూపర్ మార్కెట్లలో బియ్యం ఖాళీ అయ్యాయి. ఈ విషయం తెలిసి బియ్యం కొనుగోలు కోసం దగ్గర్లో ఉన్న కాస్ట్ కో సూపర్ మార్కెట్ కు వెళ్ళిన వారికి అప్పటికే బియ్యం బ్యాగ్ లు అయిపోయాయి ఆని బోర్డులు దర్శనం ఇచ్చాయి. రెండు మూడు సూపర్ మార్కెట్లు తిరిగినా బియ్యం దొరక పోవడంతో చివరికి బాస్మతి బియ్యం బ్యాగులు వేసుకుని వచ్చేస్తున్నారు.

మన దేశం నుంచి అమెరికాకు బియ్యం ఎగుమతిని నిషేదిస్తున్నట్లు సమాచారం రాగానే ఇక్కడి బియ్యం దిగుమతిదారులు, బడా సూపర్ మార్కెట్లు కృత్రిమ కొరత సృష్టించినట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. బియ్యం ఎగుమతి బ్యాన్ కొంతకాలం ఇలాగే ఉంటే స్టాక్ ఉన్న బియ్యం ధర పెంచి విక్రయిస్తారని చెబుతున్నారు. అమెరికాలో ఉన్న దాదాపు 50 లక్షల మంది భారతీయులుంటే వీరిలో 90 శాతం మంది రైస్ వాడుతున్నారు. అందులో మన దేశీయ బియ్యం వినియోగిస్తున్నారు. అందుకే మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువ చేసే 12.5 మిలియన్ టన్నుల(కోటి 25 లక్షల టన్నులు) బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం ఎగుమతిని నిలిపి వేస్తే అమెరికాలో ఉన్న మన వాళ్ళకు ఇబ్బందులు తప్పవు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ నష్ట నివారణ కోసం దేశంలో బియ్యం కొరత రాకుండా విదేశీ ఎగుమతులను కంట్రోల్ చేస్తుందనే విమర్శలు లేకపోలేదు.
సేకరణ, జర్నలిస్ట్ సోమయ్య, ఫేస్ బుక్ వాల్ నుంచి
