
ప్రచారంలో ముందున్న నూతి శ్రీకాంత్
నియోజకవర్గంలో కొత్త ట్రెండ్
పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!!
హైదరాబాద్, సెప్టెంబరు 01:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేలకున్నా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఆపార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో అందరికన్నా ముందే ఉంది. ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గౌడ్ వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా టికెట్ దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా నియోజక వర్గంలో చురుగ్గానే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వస్తున్నాడు. కాగా తాజాగా ఎన్నికల వాతావరణం వేడెక్కక ముందే నూతి శ్రీకాంత్ అంబర్‌పేట్‌లో పాగా వేసేందుకు సరికొత్త ట్రెండ్‌తో ప్రచారానికి తెరలేపారు.

క్యాంపెయిన్ లో ముందంజ..
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంకా పార్టీ టికెట్ వస్తుందో రాదో అని డైలామాలో ఉంటే ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మాత్రం దీనికి భిన్నంగా అంబర్ పేట్ నియోజకవర్గంలో ప్రచారానికి ముందే సిద్ధమైయ్యారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నుంచే నూతి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గత భోనాల పండుగ, పంద్రాగస్టు ఇలా అకేషన్ ఏదైనా ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించారు. అకేషన్‌లకు పది రోజుల ముందే ప్లాన్ చేసి నయా ట్రెండ్ ఫాలో అవుతూ క్యాంపెయిన్ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు తేరుకోక ముందే ఫ్లెక్సీలు,వాల్ రైటింగ్‌లు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్లతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నూతి శ్రీకాంత్ గౌడ్ దర్శనమిస్తున్నడు. ప్రతి పోలింగ్‌బూత్‌లో తన కార్యకర్తలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నడు. ఇలా అందరికంటే ముందే ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నడు.




అధిష్టానం ఆశీస్సులు ఎవరికో..?
అంబర్‌పేట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ సీటును దక్కించుకోలేక పోయింది. నియోజకవర్గం ఏర్పడిన తరువాత రెండు సార్లు కాంగ్రెస్ పోటీ చేసినా గట్టి పోటీ ఇవ్వలేక పోయింది. గత 2018లో కాంగ్రెస్ పోటీలో లేదు. కానీ ఈ సారి ఎలాగైనా పార్టీ బరిలో నిలిచే ప్రయత్నం జరుగుతోంది. యువనేతగా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గౌడ్ అంబర్ పేట నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నరు. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో సామాజిక వర్గం నేత పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనేది తేలాల్సి ఉంది.
అంబర్‌పేట రాజకీయ పరిస్థితి..!!
గత 2009 పూనర్విభజనలో భాగంగా అంబర్‌పేట ప్రత్యేక నియోజవర్గంగా ఏర్పడింది. అనంతరం ఇక అక్కడి నుంచి రెండు సార్లు 2009, 2014లో ప్రస్తుత కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018లో మాత్రం ఈ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది. అప్పటి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన కాలేరు వెంకటేశ్ 11వేల మెజారిటీతో సమీప ప్రత్యర్థి జీ కిషన్ రెడ్డిపై విజయం సాధించారు.
