
అవసరమైన నిధులు రూ.5వేల కోట్లు
బడ్జెట్ కేటాయింపులు రూ.500కోట్లు
ఇచ్చిన రూ.50కోట్లతో వచ్చేది 3వేల యూనిట్లే
వీటితోనే ఎన్నికల వరకూ సాగదీసే యత్నం
డీడీలు చెల్లించింది 85వేల మంది
గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలిః జీఎంపీఎస్
ఈనెల 9న డైరెక్టరేట్ ముట్టడి
హైదరాబాద్, అక్టోబరు 06
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం అమలు సర్కారు నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. గొల్ల, కురుమ సామాజిక వర్గాల లబ్ధిదారులు తమ వాటాను డీడీ కట్టి ఎదురు చూస్తున్నా ఎన్నిలక టైమ్ లో కొన్ని గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోంది. సర్కారు ఎన్నికలు వచ్చినప్పడల్లా ప్రకటనలు చేయడం ఆతరువాత నిధులు ఇవ్వడం లేదు. దీంతో పథకం ప్రారంభమై 6ఏళ్లు దాటినా ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ కాలేదు. తాజాగా తక్కువ నిధులు ఇచ్చి ఎన్నికల వరకు సాగదీసి వాటినే సర్ధుకోవాలనే ప్రయత్నం జరుగుతోందనే విమర్శి ఉంది.
సర్కారు నిధులు ఇచ్చింది రూ.50కోట్లే..
గొర్రెల దిగుమతి లోటు తగ్గించి, గొల్ల కురుమలను ఆర్థికంగా ఎదిగేందుకు గత 2017లో సర్కారు గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. రాష్ట్రంలో 75 శాతం సబ్సిడీతో 7లక్షల 29వేల 67 గొల్లకురుమల కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాలని నిర్ణయించింది. కోటిన్నర గొర్రెలను పంపిణీ అని చెప్పి పూర్తి చేయలేదు. ఇంకా 3లక్షల 63వేల కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,16,370 మంది లబ్దిదారులు డీడీలు చెల్లించారు. వీరిలో కేవలం 27వేల మందికి మాత్రమే యూనిట్లు పంపిణీ జరిగింది.. గొర్రెల పంపిణీ కోసం కేవలం తాజాగా రూ.50కోట్లు మాత్రమే సర్కారు విడుదల చేసింది. ఇచ్చిన నిధులతో కేవలం 3,800 యూనిట్లకే సరిపోతాయి. డీడీలు కట్టిన మిగితా 85వేల మందికి ఎట్ల పంపిణీ చేస్తారని లబ్ధిదారులు ప్రశ్నించారు. వాస్తవానికి గొర్రెల పంపిణీ కోసం రూ.4500 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది. కేటాయించిన నిధుల్లో రూ.50కోట్లు అంటే 10శాతమే విడుదల చేసి చేతులు దులుపుకుంది.దీంతో గొర్రెల పథకం లక్ష్యం నెరవేరడం లేదు.
అప్పులు కట్టలేక ఇబ్బందులు

గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ.45వేల చొప్పున డీడీలు తీసిన్రు. గొర్రెల పథకం కోసం ఆశపడి బంగారం కుదువపెట్టి, ప్రైవేటు వడ్డీలు తీసుకుని డీడీలు కట్టిన్రు. ఇటు గొర్లు రాక, అటు తెచ్చిన అప్పు కట్టలేక గొల్లకురులమ ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల పంపిణీ గొల్లకురుమల ఓట్ల కోసం తప్ప వారు బాగుపడాలనే ఉద్దేశ్యం ప్రభుత్వ పెద్దలకు లేదని గొర్లకాపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసి సొంతంగా గొర్రెల కొనే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నరు.
గొల్లకురుమలు కోటీశ్వర్లు యేడయిన్రు..

‘రాష్ట్రంలో కోటి వరకు గొర్రెలు ఉన్నయ్.. ప్రభుత్వం కోటిన్నర గొర్రెలు పంపిణీ చేస్తం..రెండున్నర కోట్లు అయితయి..రెండు సంవత్సరాల్లో మూడు ఈతలు ఈనుతయ్..ఇలా ఏడున్నర కోట్ల గొర్రెలు అయితయి..వీటిలో రెండున్నర కోట్లు పెంపకానికి ఉంచుకొని ఐదుకోట్లు అమ్ముకుంటే 5వేలకు ఒక గొర్రె చొప్పున రూ.25వేల కోట్లు.. వందకు వందశాతం రెండున్నర ఏళ్లలో రూ.25వేల కోట్ల సంపదను మా తెలంగాణ గొల్లకురుమలు సృష్టించబోతున్నరు..నేను నిండుమనస్సుతోని కొంరెల్లి మల్లన్నకు కడుపునిండ దండపెట్టి చెప్పుతున్న…ఇది కేసీఆర్ మాట వందశాతం నిజమై తీరుతది.. మూడేళ్ల తరువాత దేశంలో అత్యంత ధనవంతులైన గొల్లకురుమలు ఏరాష్ట్రంలో ఉన్నరంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నరనే మాట వస్తుంది మీరు చూస్తరు..’…ఇవన్నీ ఆరేళ్ల కిందట సీఎం చెప్పిన బంగారు తెలంగాణ లెక్కలు. ఇప్పటికీ ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది.

జీఎంపీఎస్
గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి
అక్టోబర్ 9న పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ ముట్టడిః జీఎంపీఎస్
గొర్రెల పంపిణీకి సరిపడా నిధులు కేటాయించి, నగదు బదిలీ చేయాలి. ఇదే డిమాండ్‌తో అక్టోబర్ 09న రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఈ జూన్ 9వ తేదీన రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేసి అందరికీ గొర్రెలిస్తామని నమ్మించారు. ఇప్పటికే దశలవారిగా ఆందోళనలు చేపట్టాం. సర్కారులో స్పందన లేక పోవడంతో తప్పని పరిస్థితిలో డైరెక్టరేట్ ను ముట్టడించాలని నిర్ణయించించాం.