
–
-ఐఏఎస్‌లు విద్యుత్ సంస్థల ప్రగతిని అడ్డుకుంటన్నరు
-ఆదరణ చూసి వారు ఓర్వలేక పోతున్నరు
-సీఎం చెప్పినా నిధులు ఇవ్వట్లే
ఇలాగే కొనసాగితే కరెంటు సరఫరాకు ఇబ్బందే
-విషయం చెప్పాక మమ్మల్ని తొలగించే కుట్ర జరగొచ్చు
-అకౌంట్స్ ఆఫీసర్స్ నూతన భవనం ప్రారంభించిన
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
–ఐఏఎస్‌లపై హాట్ కామెంట్స్
హైదరాబాద్, అక్టోబరు16
విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వంలోని కొంతమంది ఐఎఎస్ అధికారులు ఓర్వలేక పోతున్నారంటూ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మింట్ కాంపౌండ్‌లో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సీఎండీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ కొంత మంది ఐఏఎస్ అధికారులు మా ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చెప్పినా విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే నాణ్యమైన కరెంటు సరఫరాలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం చెప్పాక మమ్మల్ని పదవుల నుంచి తొలగించే కుట్ర కూడా జరగొచ్చని సందేహం వ్యక్తం చేశారు. తమను తొలగించినా ఎలాంటి ఇబ్బంది లేదనీ, మమ్మల్ని ఈ ఐఏఎస్ అధికారులు ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదనీ, ముఖ్యమంత్రి తమ పని తనం చూసి తమకు ఉద్యోగాలు ఇచ్చారనీ ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని కొంత మంది అధికారులకు చేతులు జోడించి వేడుకుంటున్నా ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలతో విద్యుత్ సమస్యలకు కారణం కావద్దని సూచించారు. ఇదే విషయంలో సీఎంను కలిసే ప్రయత్నాలు చేసినా బీజీగా ఉండడం వల్ల తమ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. నిధులు అందకున్నా ఎక్కడ పంటలు ఎండకుండా, ఇండస్ట్రీస్‌కి, డొమెస్టిక్‌కు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా సరఫరా చేస్తున్నామని స్పష్టంచేశారు.


తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్
విద్యుత్ అభివృద్ధికి అందరూ ప్రొఫెషనల్స్‌నే నియమించడం ద్వారా విద్యుత్ రంగంలో అభివృద్ధి సాధించగలిగామని చెప్పారు. తెలంగాణకు పరిశ్రమలు వస్తున్నాయంటే అందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరానేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి మౌళిక వనరు విద్యుత్ అని గుర్తు చేస్తూ అధికారులు సమిష్టిగా పని చేస్తూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం తో పాటు దేశ సగటు 1250 మిలియన్ యూనిట్లు ఉంటే రాష్ట్ర విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు 70శాతం విద్యుత్ వినియోగం అధిక్యంగా ఉందని గుర్తు చేశారు. తమ ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినా విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల కావడం లేదంటే వారి ఉద్దేశ్యం ఏమింటో వారే ఆలోచించుకోవాలన్నారు. మేము ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. కొందమంది ఐఎఎస్‌లు విద్యుత్ సంస్థల్లో ఉన్నవారంతా టెక్నోక్రాట్స్ ఉన్నరనే జెలసీతో ఉన్నారని తెలిపారు. అన్నీ జయించవచ్చు కానీ అసూయను జయించలేమన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు, జెన్‌కో జేఎండీ శ్రీనివాసరావు, అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్‌సెక్రటరీ అంజయ్య,ప్రెసిడెంట్ అశోక్, నాజర్ షరీఫ్,వేణుబాబు, పరమేష్, అనురాథ, వీర స్వామీ, స్వామీ, అనీల్,డిస్కంల డైరెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

