
*గతంలో విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి
*గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిక్ లైసెన్సింగ్ బోర్డులో అక్రమ నియామకాలు జరిగాయి
*మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తమకు బోర్డు మెంబర్ రాకుండా అడ్డకున్నారు:ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్, జనవరి 25
తమకు న్యాయంగా రావాల్సిన ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ షిప్ రాకుండా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అడ్డుకున్నారని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏ గ్రేడ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందుకూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బీగ్రేడ్ అసోసియేషన్ నాయకులు నేమాల బెనర్జీ, నక్క యాదగిరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవకతవకలను వెల్లడించారు. మాజీ మంత్రి జగదీస్‌రెడ్డి లైసెన్సింగ్ బోర్డులో మెంబర్ షిప్‌లో రాకుండా అడ్డుకుని జీవోను, ఆర్డర్‌ను తొక్కిపెట్టి తమకు తీరనీ అన్యాయం చేశారని ఆరోపించారు. అర్హులైన తమను కాదనీ అర్హత లేని వ్యక్తులు, తక్కువ ఓట్లు వచ్చిన వారికి బోర్డు మెంబర్‌లుగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి ఒత్తడితో అధికారులు తమకు బాధ్యతలు ఇవ్వలేదన్నారు.


కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఏగ్రేడ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నుంచి తాను పోటీ చేయగా తనకు 2200 ఓట్లు రాగా, తన సమీప అభ్యర్థికి 99 ఓట్లు మాత్రమే వచ్చాయనీ అయినా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి, అధికారులను కుమ్మక్కై తనను కాదనీ తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి రాత్రికి రాత్రి జీవోను ఇచ్చి బోర్డు మెంబర్‌గా నియమించారని ఆరోపించారు.

బీగ్రేడ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధి నేమాల బెనర్జీ మాట్లాడుతూ అర్హత ఉన్న తనను కాదనీ, ఎన్నికల టైమ్‌లో అసలు మెంబర్‌షిప్ లేని వ్యక్తి వద్ద లాలూచీపడి త లైసెన్సింగ్ బోర్డు మెంబర్‌గా నియమించారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లగా కోర్టు తనను అర్హునిగా గుర్తించి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందన్నారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకున్నా అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించే జీవోను తొక్కి పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిన వెంటనే తనకు ఆర్డర్ వచ్చిందని నేమాల బెనర్జీ చెప్పారు. లైసెన్సింగ్ బోర్డు మాజీ మెంబర్ బీగ్రేడ్ అధ్యక్షుడు నక్క యాదగిరి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల్లో అనేక ఆగడాలు జరిగాయని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజు మహారాజు తదితరులు పాల్గొన్నారు.
