
ఒగ్గుడోలు మాస్ జాతరకు మంత్రముగ్ధులైన యూరోపియన్ ప్రేక్షకులు
మాడ్రిడ్, జనవరి 27
స్పెయిన్ దేశంలో తెలంగాణ ఒగ్గుడోలు మారు మోగింది. ఒగ్గుడోలు మాస్ జాతరకు యూరోపియన్ ప్రేక్షకులు మంత్ర ముగ్ధులైయ్యారు. స్పెయిన్ మాడ్రిడ్ లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న FITUR-24 అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ లో తెలంగాణ ఒగ్గుడోలు ప్రదర్శన అద్భుత ప్రతిభను కనబరిచింది. ప్రపంచం నలదిక్కుల నుంచి వచ్చిన అతిథులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.


గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాడ్రిడ్ లోని ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు చుక్క సత్తయ్య వారసుడు ఉస్తాద్ ఒగ్గు రవి ఆధ్వర్యంలో తెలంగాణ ఒగ్గు కళాకారులు స్పెయిన్ వెళ్లి ఎంబసీలో భారత్ తరుపున ప్రత్యేక ప్రదర్శనగా ఒగ్గుడోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతో ఒగ్గుకళాకారులు యూరోపియన్ వాసులను మంత్రముగ్ధుల్ని చేశారు. వారి అభినందనలు అందుకున్నారు. ఈ పర్యటన తెలంగాణ కురుమల ఒగ్గు సంస్కృతి విశ్వ వ్యాప్తం అవుతున్నందుకు ఆనందాన్ని కలిగించిందని ఒగ్గు రవి హర్షం వెలిబుచ్చారు.
