
పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సురేష్ పిలుపు
హైదరాబాద్, జనవరి 28
పెరిక సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పిలుపునిచ్చారు. పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన పెరిక సమాజం విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలతో పాటు రాజకీయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన పెరికలకు రాజకీయంగా నేడు సముచిత స్థానం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోనే లక్షా ఇరవై వేల మంది పెరిక సామాజిక వర్గం ఉందని గుర్తు చేశారు.

అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని పార్టీలు మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్నారు. గతంలో రాజకీయనేతలుగా, ప్రజా ప్రతినిధులుగా పెరిక సామాజిక వర్గం నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీరాంభద్రయ్య, బండిపుల్లయ్య తదితర నేతలు రాజకీయంగా ఎదిగారని, నేటి తరం యువత రాజకీయంగా ఎదగాలని సూచించారు. పార్టీల్లో టికెట్లు అడగడం కాదు అందిపుచ్చు కోవాలన్నారు. నేటి తరం రాజకీయ నేతలకు పెరికం నేతలు అధ్యక్షుడు మద్ది లింగయ్య, శ్రీరాంభద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ లాంటీ పెద్దలు సహకరించాలని కోరారు. ఈ పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పెరిక సంఘం నేతల దాసరి మళ్లేష్ , లక్ష్మీ శేఖర్, వలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.