
- హైదరాబాదులో సౌత్ సేన నిరసన…
- వాణిజ్య పనులశాఖ కమిషనర్ కి వినతిపత్రం
హైదరాబాద్, జనవరి27:
సౌతిండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సౌత్ సేన డిమాండ్ చేసింది. శనివారం సౌతిండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాదులోని సుల్తాన్ బజార్, బేగంబజార్, కోఠి తదితర ప్రాంతాల్లో సౌత్ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నార్త్ ఇండియా ఆదిపత్యాన్ని అడ్డుకోవాలని సౌత్ సేన సభ్యులు నినదించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సేన అధ్యక్షులు రవి, జాయింట్ సెక్రెటరీ కొలుకుల శ్రీకాంత్, కోశాధికారి కమటం రమేష్ (పృద్వి), నాయకులు బి.వెంకటేశ్వర్లు, మునిగంటి జగదీష్, జడ నాగరాజ్, ప్రభు కిరణ్, పి.రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ సేన నాయకులు మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోందని, అన్ని రంగాల్లో వారు పాతుకుపోతున్నారని ఆరోపించారు.

దక్షిణ భారత్‌లో నలుమూలలా విస్తరించిపోయారని .ఉత్తరాది వలసల కారణంగా దక్షిణాది ప్రజలు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉత్తరాదివారు ఇక్కడ వ్యాపారులుగా స్థిరపడిపోయి దక్షిణాది వ్యాపారస్థులను దెబ్బతీస్తున్నారని అన్నారు. జనరల్ స్టోర్స్, స్వీట్ షాపులు, హోటల్స్, జ్యువెల్లరీ, గ్రానైట్, మార్బుల్, శానిటరీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ యాక్సెసరీస్, ఐరన్, పెయింటింగ్ తదితర వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, త్రివేండ్రం వంటి పెద్ద పెద్ద నగరాల్లో వ్యాపారాలన్నింటినీ వారి గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. కొన్నిచోట్ల 25 శాతం వ్యాపారం ఉత్తరాది రాష్ట్రాల వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. రోడ్ల పక్కన టీ షాపులు, టిఫిన్ సెంటర్ల వంటి చిన్న వ్యాపారాల్లోనూ ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోయిందని విమర్శించారు.
మూతపడుతున్న దక్షిణాది వ్యాపారాలు…
ఉత్తరాది రాష్ట్రాల వాళ్లే ప్రతి జిల్లాలోనూ వ్యాపారాలను నెలకొల్పారని, వీరి పోటీని తట్టుకోలేక స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలను మూసేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వైశ్య సామాజికవర్గానికి చెందిన వ్యాపారులు ఉత్తరాది ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారని. వారి మనుగడకే ప్రమాదం ఏర్పడిందని వాపోయారు. అంతేకాదు ఇక్కడ వ్యాపారాలు నెలకొల్పుతున్న ఉత్తర భారతీయులు సిండికేట్ అయి మన వ్యాపారులను దెబ్బతీస్తున్నారని, అనేక వ్యాపారాల్లో నకిలీకి ఆజ్యం పోస్తున్నారని . ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన క్యాన్సర్ ఔషధాల నకిలీలో ఉత్తరాది వ్యాపారులే ఉన్నారని ఆరోపించారు.


ఉత్తరాది వ్యాపార మాఫియా దక్షిణాదిపై దాడి చేస్తుంది. అంతేగాక ఉత్తరాది వ్యాపారులు స్థానిక కార్మికులను పనిలోకి తీసుకోవడం లేదన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకే పని కల్పిస్తున్నారు, దక్షిణాదిలో ఉత్తర భారతీయుల జనాభా దాదాపు మూడు కోట్ల వరకు ఉంటుందని అంచనా. రోజురోజుకూ వారి పెత్తనం, ఆధిపత్యం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఉత్తర భారతీయుల ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు ‘సౌత్ సేన’ ఏర్పడిందని స్పష్టం చేశారు. ఉత్తరాది ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్ఛేరి ముఖ్యమంత్రులకు లేఖలు రాశామని వివరించారు. మున్ముందు ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు దక్షిణాది ప్రజలు ముందుకు రావాలని సౌత్ సేన అధ్యక్షులు రవి పిలుపునిచ్చారు.

