
హైదారాబాద్, మే 10
తెలుగు రాష్టాలలో సంక్రాంతి వస్తే అందరికి గుర్తొచ్చేది గోదావరి జిల్లాల్లో జరిగే కోళ్ల పందేలు. ఎండాకాలంలో ఐపిఎల్ సీజన్ వస్తే గుర్తొచ్చేది క్రికెట్ పందేలు. ఇకనుంచి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల పందేలు కూడా గుర్తొస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలపై ఆన్లైన్ ఆప్ ల ద్వారా పందేలు జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా బెట్టింగ్
దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల అభ్యర్ధులపై పందేలు జరుగుతున్నాయి. ప్రైవేట్ యాప్ ల ద్వారా ఈ పందేలను నిర్వహిస్తారు. ప్రైవేట్ అకౌంట్ ల ద్వారా మనీని ఇన్వెస్ట్ చేసి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో అని పందేలు జరుగుతున్నాయి. యాప్ ల ద్వారా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ని మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్రాలు, పార్టీలు, అభ్యర్థులు వారిగా 100 నుంచి 10 లక్షల దాకా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటివరకు క్రికెట్ బెట్టింగ్ మాత్రమే తెలిసిన ప్రజలకు, దందాలు చేసేవారు ఎన్నికల బెట్టింగ్ ని సైతం పరిచయం చేస్తున్నారు.

రాజ క్రీడలు
క్రికెట్, ఫుట్ బాల్,రగ్బీ, హార్స్ రైడింగ్ లాంటి క్రీడలపై ఇప్పటివరకు బెట్టింగులు నడిపిన అదే యాపులు ప్రస్తుతం ఎన్నికలపై బెట్టింగులు నడుపుతున్నాయి. క్రికెట్లో బంతి బంతి మీద ఎలాగైతే బెట్టింగులు జరుగుతాయో… అదే మాదిరి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై, పార్టీల సీట్లపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఈ కొత్తరకమైన బెట్టింగ్ వాతావరణం 2019 ఎన్నికల నుంచి వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాస్త మోతాదులో జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల వారిగా బెట్టింగులు నడుస్తున్నాయి. బెట్టింగుల కోసం ఫెయిర్ ప్లే, జన్నత్ బుక్, ఓం 247, జై బుక్, సాట్ స్పోర్ట్, బకార్డి వంటి యాపులను వినియోగిస్తున్నారు.

లక్షల్లో బెట్టింగ్
ఎన్నికల బెట్టింగులు 100 నుంచి మొదలయి 10 లక్షల దాకా జరుగుతున్నాయి. ఈ బెట్టింగులకు వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాపులను వాడుతున్నారు.ఈ బెట్టింగ్ దందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్టాలకు కూడా పాకింది. బెట్టింగులు నిర్వహించటం, ఆడటం చట్టవిరుద్దం. బెట్టింగ్ యాపులు ఫోన్లో ఇన్స్టాల్ చేసే ముందు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలా మన ఫోన్లోకి వచ్చి మన వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు దోచేస్తున్నారు. బెట్టింగు యాపులు చాలా ప్రమాదకరం అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
