
వాషింగ్టన్ డిసి, జూలై 14
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దుండుగుడి కాల్పులు జరిపినప్పుడు ట్రంప్ వెంటనే క్రిందికి ఒంగడంతో ప్రమాదం తప్పింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడిచెవికి గాయం అయి ముఖం నిండా రక్తం కారింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రంప్ భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయి దుండగుడి మీద కాల్పుల వర్షం కురిపించడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. డొనాల్డ్ ట్రంప్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్రంప్ టార్గెట్ గా కాల్పులు
ఈ ఏదాది నవంబరులో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ పార్టీ తరపున పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్‌నే టార్గెట్ చేసుకుని దుండగుడు కాల్పులు జరిపినట్లు భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభలో వేల మంది పాల్గొన్నారు. ట్రంప్ మీద జరిపిన కాల్పుల దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. కాల్పుల శబ్దం విని వెంటనే ట్రంప్ పోడియం కిందకి బెండ్ అవటంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే అప్రమత్తమయిన భద్రతాసిబ్బంది ఆయనకు వలయంగా చేరి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు దగ్గర్లో వున్న భవనం నంచి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. తుపాకీతో ర్యాలీకి వచ్చి అతడు భవనం పైకి ఎక్కినట్లు తాను గమనించినట్లు ప్రత్యక్ష సాక్షి భద్రతా బలగాలకు వివరించాడు.

ఘటనపై స్పందించిన ట్రంప్
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై కాల్పుల తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ సైట్ లో స్పందించారు. తన కుడిచెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్ళిందని అన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఏదో తేడాగా వుందని అర్థమయిందని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు తెలియదు. అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం నమ్మశక్యంగా లేదని ట్రంప్ అన్నారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలకు ధన్యవాదాలు తెలిపారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల్లో మరణించిన వ్యక్తికి తన సంతాపాన్ని తెలియజేశారు.
ఖండించిన పలువురు దేశ అధినేతలు
డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పుల ఘటనపై పలు దేశాల అధినేతలు స్పందిస్తున్నారు. ట్రంప్‌పై కాల్పుల ఘటన మీద ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా మోడీ ఆకాంక్షించారు. స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా.. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని ప్రధాని ట్వీట్ చేశారు. ట్రంప్‌పై దాడిని అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌పై దాడిని ఖండించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారీస్ స్పందిస్తూ అమెరికాలో హింసలకు స్థానం లేదు. ట్రంప్ గాయం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కమలా హారీస్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, లోకల్ అథారిటీస్ రంగంలోకి దిగాయి..
