
జీజేసీ జనగాం ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి
జనగామ, అక్టోబరు05
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అన్నారు. ప్రకృతిలో లభించే పువ్వులను ఆరాధించే పండుగే బతుకమ్మ అని పేర్కొన్నారు. శనివారం జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. విద్యార్థుల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆట, పాటలతో అలరించారు.ఈ సందర్భంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…., ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్కజాములాయే చందమామ…, పసుపుల పుట్టింది గౌరమ్మా… పసుపుల పెరిగింది గౌరమ్మా… అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు, బంధాలు , బంధుత్వాలపైనా విద్యార్థులు, అధ్యాపకులు పాటలు పాడుతూ ఆ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
