
#ప్యాక్స్ పర్సన్ ఇంచార్జీ కమిటీల పాలనకు మంగళం
#నియామక కమిటీలు రద్దు
#ఇకపై సొసైటీల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా అధికారులకే
జీవో జారీ
హైదరాబాద్, డిసెంబర్ 19
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) నిర్వహణ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సొసైటీల్లో కొనసాగుతున్న అనఫిషియల్ (ప్రైవేట్ వ్యక్తుల) పర్సన్ ఇన్‌ఛార్జ్ కమిటీల పాలనకు మంగళం పాడింది. ఇకపై సొసైటీల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా అధికారులకే (ఆఫీషియల్ పర్సన్-ఇన్‌చార్జ్) అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఆగస్టు 14, 2025న జారీ చేసిన జీవో నెం. 386ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జీవో ద్వారా నియమించబడిన కమిటీలను తక్షణమే రద్దు చేస్తూ, వాటి స్థానంలో ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీలను నియమించాలని సహకార శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ జీవో ఆర్టీ నెం. 597ను విడుదల చేశారు.

రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటుకు అనుగుణంగా పీఏసీఎస్‌ల (ప్యాక్స్ ) పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సహకార చట్టం 1964లోని సెక్షన్ 123 అధికారాలను వినియోగించుకుంటూ ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.
ఆరు నెలల గడువు..
కొత్తగా నియమించబడే ఈ అధికారిక పర్సన్ ఇన్‌ఛార్జ్ కమిటీలు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆరు నెలల పాటు లేదా సొసైటీలకు ఎన్నికలు జరిగే వరకు (ఏది ముందైతే అది) అధికారంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని సహకార శాఖ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
