
తెలంగాణలో విద్యుత్ కనెక్షన్ల జారీలో సంచలన మార్పు: అదనపు చెల్లింపులు రద్దు
హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (TGERC) విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చింది. ఇకపై ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండానే కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీ చేసేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 5 నుంచి అమలులోకి వస్తాయి.
గతంలో సమీపంలో విద్యుత్ లైన్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో, ఆ లైన్ నుండి వినియోగదారుడి ప్రాంగణం వరకు స్తంభాలు, తీగలు వేసే ఖర్చు దూరాన్ని బట్టి వినియోగదారుడే భరించాల్సి వచ్చేది. ఇకమీదట ఇలాంటి అదనపు భారం ఉండదు. బదులుగా, సాంక్షన్డ్ లోడ్ ఆధారంగా స్లాబ్ వారీగా ఫిక్స్‌డ్ సర్వీస్ లైన్ ఛార్జీలు (SLC) మాత్రమే వసూలు చేస్తారు. ఇది ప్రక్రియను సరళీకరించడమే కాకుండా, వినియోగదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

ప్రధానంగా రైతాంగానికి ఈ నిర్ణయం తీపి కబురుగా మారింది. వ్యవసాయ కనెక్షన్లు (LT-V) అన్ని లోడ్‌లకు కేవలం రూ.1,000 నుంచి kWకు మాత్రమే వసూలు చేస్తారు. రైతుల నుండి ఇతర ఏ చార్జీలు లేవని స్పష్టం చేశారు. అలాగే, కొత్తగా అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు నిర్మించినవారికి కూడా ఊరట లభిస్తుంది. భవనం మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా ఛార్జీలు వేస్తారు. 20 kW పైబడిన లోడ్‌లకు డెవలప్‌మెంట్ ఛార్జీలు రద్దు చేశారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు, నిర్వహణ డిస్కమ్‌లే భరిస్తాయి.
ఈ మార్గదర్శకాలు TGERC పూర్తిగా తీసుకున్న నిర్ణయమే. డిస్కమ్‌లు (TGSPDCL, TGNPDCL) వీటిని అమలు చేయాల్సిన బాధ్యత వహిస్తాయి. ఇది రైతులు, గృహ నిర్మాణదారులు, కొత్త వినియోగదారులకు పెద్ద ఊపిరి పోసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
