
చిన్నారి చికిత్సకు రూ.60 వేలు ఆర్థిక సహాయం అందించిన ఔదార్యవంతుడు అంజయ్య
హనుమకొండ, డిసెంబర్ 21 : తండ్రి లేని నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో అల్లాడుతున్న చిన్నారి ఆశ్రితకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, మానవత్వానికి అద్దంపట్టారు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి బాసటగా నిలిచారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దండుగూడెం గ్రామానికి చెందిన చిన్నారి ఆశ్రితకు ఇటీవల తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రిని కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబం భారీ వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇక్కట్లు పడింది. దవాఖాన బిల్లులు చెల్లించలేక కుటుంబ సభ్యులు మనస్తాపం చెందారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పాపకంటి అంజయ్య తక్షణం స్పందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థతో సమన్వయం చేసుకొని, ఆదివారం నేరుగా హసన్‌పర్తికి వెళ్లి చిన్నారి ఆశ్రితను పరామర్శించారు. ఆమె చికిత్సకు రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి ధైర్యం నూరిపోశారు.
ఈ కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు నాజర్ షరీఫ్, పరమేష్, అనిల్, అనురాధ, అపర్ణ, శ్రీనివాస్, తేజస్విని, లక్పతి, శ్రీకాంత్, లక్ష్మణ్, శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సమాజంలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్న పాపకంటి అంజయ్య ఈ ఔదార్యంతో మరోసారి అందరి మనసుల్ని ఆకర్షించారు.
