
హైదరాబాద్, డిసెంబర్ 21 : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఎనిమిది మంది కరాటే విద్యార్థులకు బ్లాక్ బెల్ట్‌లు ప్రధానం చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ హాజరై, విద్యార్థులకు బెల్ట్‌లు అందజేశారు.
అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు మహిమ, ద్వైత, నివేది, ఆదిత్య, జెనజ, పర్వ్, ఆరిని, బృహతి లు ఉన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మహాలక్ష్మి రామన్ గౌడ్ మాట్లాడుతూ యువతతో పాటు బాలికలు కూడా బ్లాక్ బెల్ట్ సాధించడం ఎంతో ప్రేరణాత్మకమని అభివర్ణించారు. కరాటే విద్య కేవలం నైపుణ్యం మాత్రమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకు, ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థిరత్వం చాలా ముఖ్యమని, ఈ విద్యకు వయసు అడ్డు కాదని ఆమె ఉద్ఘాటించారు.
కార్యక్రమంలో అకాడమీ సీనియర్ మాస్టర్లు నర్సింగరావు, కరీం, అమృత రెడ్డి, గణ సంతోషిణి రెడ్డి, సుభాష్, మహేందర్, రాజు, నర్సింగ్ లు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ విజయోత్సవంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
