
మదురో దంపతులు బంధీలు – చమురు, డ్రగ్స్, వలసలపై ఆరోపణలు
వాషింగ్టన్/కారకాస్, జనవరి 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనిజులాపై భారీ సైనిక దాడి జరిగింది. ఈ దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా బలగాలు బంధించి దేశం నుంచి తరలించాయని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. “అమెరికా దళాలు వెనిజులాపై లార్జ్ స్కేల్ స్ట్రైక్ నిర్వహించాయి. మదురో మరియు ఆయన భార్యను బంధించి దేశం నుంచి తరలించాం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్‌తో పాటు మిరాండా, అరాగువా, లా గౌయిరా రాష్ట్రాల్లోని సైనిక మరియు పౌర లక్ష్యాలపై అమెరికా దాడులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు వినిపించాయి. ఫ్యూర్టే టియునా, లా కార్లోటా సైనిక స్థావరాలు, హిగురోటే విమానాశ్రయం వంటి ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నష్టం, మరణాల వివరాలు ఇంకా స్పష్టత రాలేదు.
వెనిజులా ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. “అమెరికా మా చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ దాడి చేసింది” అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినట్లు మదురో ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మదురో ఆచూకీ తెలియదని, అమెరికా నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ లైఫ్’ డిమాండ్ చేశారు.
అమెరికా దాడులకు ప్రధాన కారణాలుగా మూడు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి:
- వలస సంక్షోభం: మదురో విధానాల వల్ల లక్షలాది వెనిజులాప్రజలు అమెరికాకు వలస వెళ్లారని ట్రంప్ ఆరోపించారు. నేరస్థులు, మానసిక రోగులను ఉద్దేశపూర్వకంగా అమెరికా వైపు నెట్టారని ఆరోపణలు.
- చమురు వనరులు: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులా చమురుపై అమెరికా ఆసక్తి చూపుతోందని నిపుణుల అభిప్రాయం. చైనాకు ఎగుమతి అయ్యే చమురును అడ్డుకోవడం లక్ష్యమని చర్చ.
- మాదకద్రవ్యాల రవాణా: కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్‌ను అమెరికాలోకి తరలించడంలో వెనిజులా ప్రధాన మార్గమని ట్రంప్ ఆరోపణలు. ఈ కారణంగా వెనిజులా ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు.
ఈ ఘటనపై అంతర్జాతీయ స్పందనలు వస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం పిలుపునిచ్చారు. రష్యా, ఇరాన్, క్యూబా దాడిని ఖండించాయి. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు.
ట్రంప్ మరిన్ని వివరాలు మార్-ఎ-లాగోలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడిస్తారని తెలిపారు. వెనిజులాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
