
కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణల
హైదరాబాద్, జనవరి 3 (VGlobe News): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా 1200 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకుపోయిందని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సహకరించడంతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఆస్కారం లభించిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్టును ఆపేయడంలో విజయం సాధించామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి మరణ శాసనం రాసినట్లేనని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ రోజుకు 3 టీఎంసీల నీటిని వినియోగిస్తుండగా, అప్పటి ప్రభుత్వం మౌనం వహించిందని వివరించారు. కేటాయించిన జలాలను సద్వినియోగం చేసుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని, కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఎక్కువగా నీటిని వినియోగించుకున్నారని ఆయన తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్‌పై రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరాకు కూడా నీటిని అందించలేకపోయారని మంత్రి విమర్శించారు. రూ.7,469 కోట్లు ఖర్చు చేసి ఉంటే కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, దాని ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చూపిన శ్రద్ధ పాలమూరుపై లేదని ఆక్షేపించారు. 2018లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, కాళేశ్వరానికి త్వరగా క్లియరెన్స్‌లు తెచ్చుకున్నారని, పాలమూరుకు మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకురాలేదని వెల్లడించారు.
పాలమూరు ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసి సీడబ్లూసీకి సమర్పించే వరకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారని, బీఆర్ఎస్ హయాంలో 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు చేరుకుందని, పాలమూరుకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని ఆయన ఆరోపించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా కావాలని బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో వాదిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మొదటిసారిగా 2024 ఫిబ్రవరిలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు 71 శాతం జలాలు కేటాయించాలని వాదనలు వినిపించామని చెప్పారు. ఇరిగేషన్ అప్పులపై 16 వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు.
