ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి నుంచి

10 లక్షల మంది విద్యార్థులు

1,495 కేంద్రాల్లో పరీక్షలు
5 నిమిషాల గ్రేస్ టైం

– 9.05 వరకు ప్రవేశం అనుమతి
ఒత్తిడి తగ్గించేలా టెలి-మానస్ కౌన్సెలింగ్

లిఫ్ట్ ఇవ్వాలని ప్రజలను కోరిన అధికారులు

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (VGLOBE NEWS): తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) 2026 ఈరోజు (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,97,075 మంది విద్యార్థులు – ఇంటర్ ఫస్ట్ ఇయర్  4,89,126 మంది, సెకండ్ ఇయర్ వ  5,07,949 మంది – 1,495 పరీక్షా కేంద్రాల్లో  ఇంటర్  పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ వ బోర్డు (టీజీబీఐఈ) కార్యదర్శి ఎస్. కృష్ణ అదిత్య మీడియా కు  తెలిపారు. గత తరహాలో  ఈ ఏడాది కూడా 5 నిమిషాల గ్రేస్ టైం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పరీక్షలు 9 గంటలకు ప్రారంభమైనా, విద్యార్థులు 9.05 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించవచ్చు. అయితే, 9.05 తర్వాత వచ్చేవారికి అనుమతి ఉండదు. రాత పరీక్ష సమయంలో మాత్రం మార్పు లేదు. ట్రాఫిక్ జామ్, ఇతర అనివార్య కారణాల వల్ల ఆలస్యమయ్యే విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం.

విద్యార్థులకు సూచనలు:
పరీక్షా కేంద్రాలకు కనీసం 30 నిమిషాల ముందు చేరుకోవాలని బోర్డు సలహా ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లోని కేంద్రాలకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. హాల్ టికెట్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కేంద్రం సులభంగా గుర్తించవచ్చు. హాల్ టికెట్లు కాలేజీ లాగిన్, బోర్డు వెబ్‌సైట్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా లభ్యం. పేరు, సబ్జెక్టులు సరిచూసుకోవాలి. లోపాలుంటే తక్షణం కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా సరిద్దించుకోవాలి.

పరీక్షల  నిర్వహణకు భారీ ఏర్పాట్లు:
1,495 చీఫ్ సూపరింటెండెంట్లు, 1,495 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 28,500 ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహిస్తారు. ప్రశ్నా పత్రాలు సాయుధ ఎస్కార్ట్‌తో పోలీస్ స్టేషన్లకు చేర్చారు. 20 స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సంస్కృతం పరీక్ష తర్వాత ఫిబ్రవరి 26 నుంచి సమాధానాల మూల్యాంకనం ప్రారంభం. సుమారు 7,500 సీసీటీవీ కెమెరాలు కేంద్రాల్లో ఏర్పాటు చేసి, బోర్డు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారు. అన్ని కేంద్రాల్లో మంచినీళ్లు, గోడ గడియారాలు, పనిచేసే టాయిలెట్లు, డ్యూయల్ డెస్కులు అందుబాటులో ఉంటాయి. ఎవరూ నేలపై కూర్చొని పరీక్ష రాయరు.

మానసిక సహాయం, హెల్ప్‌లైన్లు:
పరీక్షల ఒత్తిడి, ఆందోళన, నర్వస్‌నెస్ ఎదుర్కొనే విద్యార్థులు, తల్లిదండ్రులు టెలి-మానస్ సహాయం తీసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేయాలి. బోర్డు కంట్రోల్ రూమ్ నంబర్ 040-24655027 (ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు), ఐవీఆర్ సిస్టమ్ 9240205555 కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రజలకు అధికారుల వినతి:
పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ప్రజలు లిఫ్ట్ ఇవ్వాలని బోర్డు అధికారులు విజ్ఞప్తి చేశారు. టీజీఎస్‌ఆర్‌టీ రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది. విద్యుత్, ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుని పరీక్షలు సురక్షితంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాయి.

ఈ ఏడాది 1వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. మొదటి రోజు 1వ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, 2వ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వాలని బోర్డు, అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఆల్ ద బెస్ట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text