రైతాంగంలో పెరుగుతున్న విషాదం

66 వేల మంది రైతుల మరణాలు

91% సన్నకారు రైతులే..!

రైతు బీమా గణాంకాలు షాక్!

కరువు, అనారోగ్యం, విద్యుత్ షాక్‌లు, పాముకాట్లు ప్రధాన కారణాలు
కౌలు రైతులు, బీమా వర్తించని వృద్ధ రైతుల మరణాలు అదనం
హైదరాబాద్‌, జూన్ 18
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 66,038 మంది రైతులు మృతి చెందగా, సగటున నెలకు 2,201 మంది, రోజుకు 73 మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయాన్ని ఈ సంఖ్యలు వెల్లడిస్తున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల మరణాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, గత రెండున్నరేళ్లలో 66,038 మంది రైతు కుటుంబాలకు రూ.3,301.90 కోట్ల బీమా సాయం అందింది. 2023 డిసెంబర్ నుంచి ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024-25లో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు, 2025-26లో 20,087 కుటుంబాలకు రూ.1,004.35 కోట్ల పరిహారం చెల్లించారు.

సన్నకారు రైతులపైనే ఎక్కువ ప్రభావం
మరణించిన రైతుల్లో దాదాపు 91 శాతం మంది ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నకారు, చిన్నకారు రైతులేనని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వరుసగా దెబ్బతీయడం వల్ల వీరి జీవితం మరింత సంక్లిష్టంగా మారిందని అంటున్నారు.

అనేక కారణాలతో రైతుల మృత్యువాత
రైతుల మరణాలకు ఒకే కారణం లేదని, అనేక సామాజిక-ఆర్థిక సమస్యలు ఇందుకు దారితీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోవడం, కరువు పరిస్థితులు, అప్పుల భారం, అనారోగ్య సమస్యలు రైతులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అలాగే పంట పొలాల్లో పని చేస్తూ విద్యుత్ షాక్‌లకు గురవడం, పాముకాట్లతో ప్రాణాలు కోల్పోవడం, పురుగుమందుల ప్రభావంతో అనారోగ్యానికి గురై మరణించడం వంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఇతర కారణాలతోనూ రైతులు మృత్యువాత పడుతున్నారు.

బీమా పరిధి వెలుపల మరెందరో
అధికారిక గణాంకాల్లో నమోదైనవి కేవలం రైతు బీమా పథకానికి అర్హులైన 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన రైతుల మరణాలే. అయితే కౌలు రైతులు, 60 ఏళ్లు దాటిన రైతులు, భూ హక్కుల పత్రాలు లేని సాగుదారులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు. వీరిలో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల్లో ప్రతిబింబించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

కరువు, అప్పుల భారం రైతులను వెంటాడుతూనే…
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా కరువు పరిస్థితులు నెలకొనడం, సాగు ఖర్చులు భారీగా పెరగడం, పంటలకు సరైన ధరలు లభించకపోవడం రైతుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ఖర్చులు పెరుగుతుండగా, పంట అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల అప్పుల భారం కూడా భరించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని, దీంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. కౌలు రైతులు, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపిస్తున్నారు.

రైతులను కాపాడాలని డిమాండ్
ఒక యువకుడిని చదివించి డాక్టర్‌గా, ఇంజనీర్‌గా తీర్చిదిద్దవచ్చు. కానీ ఈ రోజుల్లో రైతును తయారు చేయడం అంత సులభం కాదు” అని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులను కూడా సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ట్రంలో రైతుల మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుకోవడం వ్యవసాయ రంగ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించే చర్యలతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text