
హైదరాబాద్, జూన్ 26:
రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని షీప్ ఫెడరేషన్ చైర్మన్ కె సరిత హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ, గొర్రెలు, మేకల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే సమావేశానికి హాజరయ్యానని చెప్పారు. ప్రభుత్వాలు కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ఇంకా పలు కీలక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల జీవాలు మృతి చెందినా నష్టపరిహారం అందడం లేదని, గొర్రెల కాపరులు మృతి చెందినా కేవలం రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియో మాత్రమే లభిస్తోందని, ఇతర వృత్తిదారులతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొన్నారు. ఇటీవల కుక్కల దాడులతో అనేక ప్రాంతాల్లో గొర్రెపిల్లలు మృతి చెందిన ఘటనలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. జీఎంపీఎస్ ప్రతినిధులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కురుమ, గొల్ల కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు రాజకీయంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.


గొర్రెల పెంపకందార్ల గొంతుకగా జీఎంపీఎస్ : ఉడుత రవీందర్
జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ, 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన జీఎంపీఎస్ గొర్రెల పెంపకందార్ల గొంతుకగా పనిచేస్తోందన్నారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ఫలితంగా మేత భూముల పరిరక్షణ, ఎక్స్‌గ్రేషియో, పశువైద్య సేవలు, మందులు, వ్యాక్సిన్ల వంటి అంశాల్లో అనేక విజయాలు సాధించామని తెలిపారు. అయినప్పటికీ ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని ఫెడరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


ఆగస్టులో రాష్ట్ర మహాసభలు
సంఘం స్థాపనకు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు రవీందర్ తెలిపారు. మహాసభల్లో భాగంగా అమరుల యాది యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కడవెండి నుంచి ప్రారంభమయ్యే యాత్ర అన్ని జిల్లాలు తిరిగి జూలై 10న కొత్తగూడెం సుజాతనగర్‌లో ముగుస్తుందని వివరించారు. మహాసభల సందర్భంగా ఒగ్గు, మందహెచ్చులు, పడపోత్ర, పగిడిజోగు, తప్పెటగుళ్లు, గొరవయ్యలు, బైకాని తదితర జానపద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ జాతుల గొర్రెలు, మేకల ప్రదర్శన, మాంసం ప్రాసెసింగ్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందార్లంతా ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇటీవల ఫెడరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సరితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు నర్సింహ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. లింగయ్య, మద్దపురం రాజు, సహాయ కార్యదర్శులు పరికి మధుకర్, సాధం రమేష్, అమీర్‌పేట్ మల్లేష్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
.
