
హైదరాబాద్, సెప్టెంబర్ 04: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి–2026 కేంద్ర కమిటీ ప్రచార–పబ్లిసిటీ, మీడియా కన్వీనర్‌గా పెరిక సురేష్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలను భక్తి, అంకితభావం, నిబద్ధతతో నిర్వర్తిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ప్రతి ఏటా భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు భారీ ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్నాయని పెరిక సురేష్ పేర్కొన్నారు. దాదాపు 1.40 లక్షల గణేష్ మండపాలు, 50 లక్షల మంది యువత భాగస్వామ్యం, 11 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకతగా తెలిపారు. బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ వరకు సాగే సుమారు 18 కిలోమీటర్ల చారిత్రాత్మక గణేష్ శోభాయాత్ర ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాలి
వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గణేష్ ఉత్సవ మండపాల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, సంపూర్ణ వందేమాతరం గీతాన్ని ఆలపించాలని 1.40 లక్షల గణేష్ ఉత్సవ మండపాల కమిటీ సభ్యులకు పెరిక సురేష్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర కమిటీ అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా. రవినూతల శశిధర్, వ్యవస్థాపకులు, సీనియర్ సలహాదారు కరోడిమల్, కార్యదర్శి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆల భాస్కర్ రాజ్, గణేష్ శోభాయాత్ర ఇన్‌చార్జ్ ఆనంద్ గుప్తాలకు పెరిక సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.
“హృదయంలో భక్తి.. చేతిలో సేవ.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
