నవంబర్‌ నుంచి యూనిట్‌కు 30 పైసలు.. ఆ తర్వాత 50 పైసలు

29 నెలల పాటు ఎస్పీడీసీఎల్‌.. 26 నెలలు ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో వసూలు

వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్లు..

వ్యవసాయ ట్రూ-అప్‌ రూ.2,214.99 కోట్లు ప్రభుత్వమే భరించాలి

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీల భారం పడనుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి డిస్కంలకు అనుమతించిన ట్రూ-అప్‌ మొత్తాన్ని వినియోగదారుల నుంచి దశలవారీగా వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నవంబర్‌ 2026లో జారీ చేసే విద్యుత్‌ బిల్లుల నుంచే వసూళ్లు ప్రారంభం కానున్నాయి.

టీఎస్‌ఈఆర్‌సీ లెక్కల ప్రకారం 2022-23, 2023-24 సంవత్సరాలకు కలిపి డిస్కంలకు రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్‌ను ఆమోదించింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను మినహాయించగా, మిగిలిన రూ.5,420.23 కోట్లను అర్హత కలిగిన ఇతర విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.4,222.93 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.1,197.30 కోట్లు ఉన్నాయి.

తొలి నెల 30 పైసలు.. ఆ తర్వాత 50 పైసలు

ట్రూ-అప్‌ వసూళ్లలో భాగంగా నవంబర్‌ 2026 బిల్లులో వినియోగించిన ప్రతి యూనిట్‌కు 30 పైసలు చొప్పున వసూలు చేస్తారు. ఆ తర్వాతి నెలల నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. సంబంధిత వినియోగదారుల 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల వార్షిక విద్యుత్‌ వినియోగంలో పన్నెండో వంతును నెలవారీ వినియోగ పరిమాణంగా పరిగణించి చార్జీ విధిస్తారు.

టీజీఎస్‌పీడీసీఎల్‌ (ఎస్పీడీసీఎల్‌) పరిధిలో ఈ వసూళ్లు 29 బిల్లింగ్‌ నెలల పాటు, టీజీఎన్‌పీడీసీఎల్‌ (ఎన్‌పీడీసీఎల్‌) పరిధిలో 26 బిల్లింగ్‌ నెలల పాటు కొనసాగనున్నాయి. అయితే ఏ వినియోగదారుడి నుంచి అయినా అతని 2022-23, 2023-24 విద్యుత్‌ వినియోగానికి ఆపాదించిన ట్రూ-అప్‌ మొత్తానికి మించి వసూలు చేయరాదని ఈఆర్‌సీ స్పష్టం చేసింది.

వ్యవసాయ వినియోగదారులకు మినహాయింపు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీలు విధించకూడదని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల ట్రూ-అప్‌ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు డిస్కంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందులో టీజీఎస్‌పీడీసీఎల్‌కు రూ.1,442.49 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు రూ.772.50 కోట్లు ఉన్నాయి.

బిల్లులో ప్రత్యేకంగా చూపించాలి

ట్రూ-అప్‌ చార్జీని విద్యుత్‌ బిల్లులో ప్రత్యేక అంశంగా చూపించాలని ఈఆర్‌సీ ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం, నెలవారీ లెక్కింపు పరిమాణం, వర్తించే రేటును బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి. అలాగే మొదటి ట్రూ-అప్‌ చార్జీ బిల్లు జారీకి ముందు తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ పత్రికల్లో విస్తృత ప్రచారం కలిగిన ప్రకటనలు ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది.

2026 అక్టోబర్‌ 5న జారీ చేసిన ఈ ఆదేశంతో, విద్యుత్‌ వినియోగదారుల నుంచి భారీ మొత్తంలో ట్రూ-అప్‌ రికవరీకి మార్గం సుగమమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text