

-వ్యవసాయ క్షేత్రాలు వండర్
-మధ్య దళారులు వుండరు
-చిన్న, సన్నకారు రైతులకు ఎక్కడైనా తప్పని కష్టాలు.
అమెరికాలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి వ్యవసాయ పంటలు, సాగు చేసే పద్ధతులు చూసి విస్తుపోతాము. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ కార్మికులు, పంట పైర్లు చూసి ఆశ్చర్య పోతాము అక్కడి. వ్యవసాయ రంగం గురించి తెలుసుకుంటే..జనాభా తక్కువగా ఉన్న ఈ దేశంలో వ్యవసాయ పనులకు కూలీలు దొరకరనే విషయం పక్కన పెడితే…వందల, వేల ఎకరాల్లో పంటలు పండించే వ్యవసాయ పనులు మనుషులతో కాదని యంత్రాలతో చేస్తుంటారు.

సాధారణంగా అమెరికాలో కేవలం పెద్ద పెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఐటీ కంపెనీలు, ఆటో మొబైల్ కంపెనీలు మాత్రమే ఉంటాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ వ్యవసాయం రంగం కూడా పెద్ద ఎత్తున ఉంది. అంతా ఆధునిక వ్యవసాయం. కొన్ని కోట్ల ఎకరాలలో ఇక్కడి ప్రజలకు అవసరమైన వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. భారత దేశంలో మాదిరిగా వరి, జొన్న, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా ఉండవు. కానీ గోధుమ, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్స్, పండ్లు, కూరగాయల పంటలను సమృద్ధిగా పండిస్తున్నారు.

పంటల సాగుతో పాటు పాల ఉత్పత్తులు ఎక్కువ. ఇందు కోసం చాలా చోట్ల వందల ఎకరాల్లో పాడి పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా అమెరికాలో అన్నింటి కంటే చికెన్ వినియోగం ఎక్కువ. వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ళ పరిశ్రమలు కూడా అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయదారులు దాదాపు 20 రకాల పంటలు పండిస్తున్నారు. పండ్ల సాగులో ప్రధానంగా ఆపిల్, ద్రాక్ష దిగుబడి ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం నడుస్తుంది.


గత దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ఇప్పుడు వ్యవసాయం కొంత తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే జనాభా పెరగడంతో కొత్త రెసిడెన్షియల్ ఏరియాలు రూపుదిద్దుకోవడం, రియల్ ఎస్టేట్ వెంచర్లు కావడం, చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేయలేక ఢీలా పడడం వంటి కారణాల వల్ల వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ అమెరికాలో భూ విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇప్పుడున్న వ్యవసాయ భూముల్లో ఆధునిక యంత్రాలతో పంటలు సమృద్ధిగా పండిస్తున్నారు. మన ఇండియాలో ఉన్నట్టు ఒక్కో వ్యవసాయదారుడికి అర ఎకరం, ఒక్క ఎకరం అంతకు మంచితే ఐదు, పదెకరాల భూమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ భూ సంస్కరణలు లేవు. ఒక్కో వ్యక్తికి భూమి ఎంతైనా ఉండొచ్చు. ఒక్కొక్కరికి 500 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమ లాగా అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్ని కూడా ఒక్కో వ్యవసాయ క్షేత్రం దాదాపు 500 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్నవే. ఇక్కడ భూ పరిమితి లేదు. దున్నే వాడిదే భూమి అన్నట్టు డబ్బున్నవాడిదే భూమి. వ్యవసాయం చేసే వాడికే ఎంతైనా భూమి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో వేల ఎకరాల్లో ఆధునిక వ్యవసాయ సాగు జరుగుతుంది.


రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులే కల్పించుకుంటారు. మధ్య దళారులు లేకుండా రైతులే తమ పంటలను వ్యవసాయ క్షేత్రాలు, రైతు బజార్లలో అమ్ముకుంటారు. ఇందుకోసం వేల సంఖ్యలో రైతు బజార్లలాంటి మార్కెట్లూ ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు పెద్ద ఎత్తున పండిస్తారు. వీటిని వ్యవసాయ క్షేత్రాల్లోనే ప్రాసెసింగ్ చేసి నేరుగా మార్కెట్లో, లేదా ఆన్లైన్ లో సేల్ చేస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ లు కూడా ఉన్నాయి. ఇతర దేశాలకు ఎగుమతులు కూడా నేరుగా రైతులే కల్పించుకుంటారు. భారత దేశంలోకి వ్యవసాయ పనులు చేసే యంత్రాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కానీ అమెరికాలో మాత్రం ఎప్పటి నుంచో భారీ యంత్రాలతో అన్ని రకాల వ్యవసాయ పనులు చేస్తున్నారు.

వ్యవసాయ భూముల్లో పనులు చేసే మనుషులు తక్కువ. యంత్రాలే ఎక్కువ. వందలు, వేల ఎకరాలున్న భూస్వాములు సొంత యంత్రాలను సమకూర్చుకుని పంటలు పండిస్తుండగా…ఐదు, పదెకరాల భూమి ఉన్న సన్న చిన్న కారు రైతులు అవసరమైనప్పుడు అవసరమైన యంత్రాలను అద్దెకు తీసుకుని పనులు చేస్తున్నారు. ఇందు కోసం వయసాయ యంత్రాలు అద్దెకిచ్చే సంస్థలు చాలా చోట్ల ఉన్నాయి. అయితే తక్కువ భూములు కలిగిన రైతులకు వ్యవసాయం మీద పెద్దగా గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. ఎందుకంటే యంత్రాలు అద్దెలు, ఇతర పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. అందుకే అమెరికాలో చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాల కంటే వేల ఎకరాల ఫార్మ్ ల్యాండ్స్ తో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు బాగా నడుస్తున్నాయి.
భారతదేశంలోనూ ఇలా వేల ఎకరాల్లో కాక పోయినా రైతులకు లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు పనిముట్లు అందరి అడుబాటులోకి వస్తే బాగుంటుందనీ రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది..
సేకరణ: జర్నలిస్టు సోమయ్య ఫేస్ బుక్ వాల్ నుంచి
