
ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలి
హెల్త్ కార్డులు అందించాలి
తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, జులై 23
అర్థాకలితో అలమటిస్తూ జీవితాన్ని నెగ్గుకొస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే రెగ్యూలరైజ్‌చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీనగర్ లోని శాతవాహన కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మహాసభ జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుండి అన్నీ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 5వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో జీతాలు అందక ఆకలి బాధలతో ప్రాణాలను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల పెత్తనం పెరిగిపోయి నెల నెలా వేతనాలు సరిగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వయసు మీద పడడం వల్ల ఎన్నో ఏళ్లుగా ఒకే శాఖలో పని చేస్తూ వేరే పని చేయలేక, ఉన్న ఉద్యోగం చేయలేని దుస్థితిలో కొనసాగుతున్నారని వాపోయారు. అధికారుల ఒత్తిడికి తలోగ్గి ఇన్నాళ్లు ఉద్యోగం చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రెగ్యులర్ చేయవలసిందిగా ముక్తకంఠంతో తీర్మానించారు. మూడేళ్లు పైబడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి 20 మంది సభ్యుల తో జేఏసీ నూతనకమిటీ ఏర్పాటైంది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ నూతన కమిటీ ఇదే..
లక్ష్మణ్(క్రీడల శాఖ), వినోద్, ,సంతోష్, అరుణ్ కుమార్, నారాయణ, నజీర్, కృష్ణ, శ్రీధర్ (ఆగ్రోస్) , జగదీష్(ఆగ్రోస్), ప్రవీణ్(అగ్రికల్చర్), సరిత, హేమలత (ఆడిట్ డిపార్ట్‌మెంట్), గోవర్థన్ (హార్టికల్చర్) , బిందు ప్రసాద్ , విజయలక్ష్మి,శ్రీకాంత్ గౌడ్,రాజా ప్రసాద్, ప్రవీణ్, జనార్ధన్ లను అందరి సమక్షంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ నూతన కమిటీ ఎన్నుకున్నారు.