
బీసీ కులాల ఫెడరేషన్ల ఏర్పాటుపై ఎందుకీ నిర్లక్ష్యం
తొమ్మిదేళ్లు ఎంబీసీ కులాలకు అన్యాయం
వెంటనే ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి
బీసీ ఫెడరేషన్ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల వెంకటేష్
హైదరాబాద్, ఆగస్టు 22
రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు బీసీ కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేయకుండా బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ ఫెడరేషన్ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అద్యక్షుడు వేముల వెంకటేష్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని కులాలకు, మతాలకు, సంస్థలకు నూతన కమిటీలు, కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఎంతసేపు గోర్లు బర్లు తప్ప ఈ వర్గాలు ఆత్మగౌరవంగా బతకడానికి అవకాశం కల్పించడం లేదన్నారు. అన్ని కులాలు, మతాలు గౌరవించే విధంగా బీసీ కులాలకు రాజకీయంగా అవకాశం కల్పించడంలో బీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నాయిబ్రాహ్మణ, కుమ్మరి , వడ్డెర కులాలకు చట్ట సభలలో అవకాశం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చి ఈ వర్గాలకు చేసింది శూన్యమని ఆగ్రహం వెలిబుచ్చారు.
అగ్రకులాలకు, అధిక జనాభా ఉన్న కులాలను తప్పా మరే కులాలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదని విమర్శించారు. బీసీ, ఎంబీసీ కులాలకు సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్లు, పాలక మండల్లు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాషర్ మెన్ ఫెడరేషన్, పూసల/ కృష్ణబలిజ ఫెడరేషన్, కుమ్మరి/శాలివాహన ఫెడరేషన్, విశ్వబ్రాహ్మణుల సమాఖ్య, నాయి బ్రాహ్మణుల సమాఖ్య, వడ్డెర ఫెడరేషన్, వాల్మీకి ఫెడరేషన్, బట్రాజు ఫెడరేషన్ , మేదరి ఫెడరేషన్లకు పాలక మండళ్లు వెంటనే ఏర్పాటు చేయాలని వేముల వెంకటేష్ డిమాండ్ చేశారు.