
*గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి
*డీడీలు కట్టిన 88వేల మందికి వెంటనే యూనిట్లు ఇవ్వాలిః జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్
హైదరాబాద్, అక్టోబరు 09
గొర్రెల పంపిణీకి నగదు బదిలీ చేయాలనీ, సర్కారు తగిన నిధులు విడుదల చేయాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్)డిమాండ్ చేసింది. సోమవారం గొర్రెల పంపిణీకి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జీఎంపీఎస్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో గొల్లకురుమలు తరలివచ్చి రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన గొల్లకురుమలు జీఎంపీఎస్ కార్యకర్తలు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.


ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మాట్లాడుతూ ప్రభుత్వం కురుమ యాదవులను కోటీశ్వరులను చేస్తానని చెప్పి అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన గొర్రెల వల్ల గొల్లకురుమలకంటే దళారులే ఎక్కువ లాభపడ్డారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,370 మంది డీడీలు కట్టించుకుని 28,000మందికే గొర్రెలు ఇచ్చారని తెలిపారు. ఐదు రోజుల క్రితం రూ.50కోట్లు విడుదల చేసి సర్కారు చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ డబ్బులతో కేవలం 3,800 మాత్రమే ఇవ్వవచ్చని, మిగిలిన 88,000మందికి ఎప్పుడిస్తారనేది ఎవరు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేకుండా డీడీలు ఎందుకు కట్టించుకున్నారని రవీందర్ ప్రశ్నించారు.
ఎన్నికలు వస్తున్నయ్..గొర్రెలు వస్తాయా రావా అని గొల్లకురుమలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి నిధులు విడుదల చేయాలని, దళారుల ప్రమేయం లేకుండా కురుమ, యాదవుల బ్యాంకు ఖాతాల్లో నగదుబదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల దాటిన గొర్లకాపరులకు నెలకు రూ.5,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదాల్లో చనిపోతే రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అన్ని గొర్లకు ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో సొసైటీల వారిగా గ్రామాల్లో తీర్మాణాలు చేసి అధికార పార్టీ అభ్యర్థులను తిరుగనీయమని, ప్రభుత్వాన్ని ఓడిస్తామని ఈ సందర్భంగా రవీందర్ హెచ్చరించారు.


ఈ సందర్భంగా డైరెక్టర్ బయటకి రావాలని గొల్లకురుమలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంత సేపటికీ అధికారులు బయటికి రాకపోవడంతో డైరెక్టర్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్న గొల్లకురుమలు, సంఘం కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొని గేటుపైకి ఎక్కి లోపలికి దిగి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు సంఘం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రతిక్తతకు దారి తీసింది.


పోలీసులు నచ్చజెప్పగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులును వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎడీ శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎంపీఎస్ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామి ఇచ్చారు.
ఈ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్, రాష్ట్ర నాయకులు ఎ. శంకరయ్య, కె.లింగయ్య, బి.అశోక్, సాదం రమేష్, టి. లింగయ్య, పి. మధుకర్, కాల్ల సురేష్, హెచ్పికెఎస్ నాయకులు ఎం.క్రిష్ణ, శ్రీకాంత్, ఓ.యూ. విద్యార్థి నాయకులు కొంగల పాండు, గట్టయ్య జిఎంపిస్ నాయకులు ఏ. కొమురయ్య, దయ్యాల నర్సింహ్మ, దేవేందర్, మల్లయ్య, మహేష్, మల్లేష్ వందలాది మంది గొల్లకురుములు పాల్గొన్నారు.
