
సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలు పెంచుతూ నాణ్యతకు ప్రాధాన్యత
హైదరాబాద్, ఫిబ్రవరి 04, 2026: సింగరేణి కొల్లరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. కృష్ణ భాస్కర్ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వినియోగదారులు నాణ్యత గల బొగ్గును మాత్రమే కోరుతున్నారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్‌లో ఆయన అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బొగ్గు మార్కెట్‌లో నాణ్యతా ప్రమాణాలు కీలకమని, పరిమాణం కంటే నాణ్యత పెంపుదలకు గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఉద్యోగులందరినీ కోరారు. ఇది సంస్థ భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) పలు కారణాల వల్ల ఉత్పత్తి లక్ష్యాల సాధనలో వెనుకబడినట్లు తెలిపిన ఆయన, మిగిలిన కాలంలో రోజుకు కనీసం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.40 లక్షల టన్నుల రవాణా, 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపును లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని ఆదేశించారు.
సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్లు తమ ఏరియాల్లో సాగుతున్న ఉత్పత్తి ప్రక్రియలను వివరించారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) గౌతమ్ పొట్రు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కో ఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
