
12న భారీ సమావేశం
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఈ నెల 12న (గురువారం) హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు.
ఈ సభలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను గౌరవించడం, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, వారి బలిదానాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే ఈ సభ లక్ష్యమని జాగృతి వర్గాలు తెలిపాయి. అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వర్గాలు ఉద్యమకారులందరూ ఈ సభలో తప్పనిసరిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే దిశగా జరగనుందని అంచనా వేస్తున్నారు.
