20వ గ్రాండ్ నర్సరీ మేళా

హైదరాబాద్: ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, జీవన ఒత్తిడి నేపథ్యంలో హరిత వాతావరణం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో గురువారం 20వ గ్రాండ్ నర్సరీ మేళా–ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోను మంత్రి ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాళ్లను పరిశీలించారు. 2015 నుంచి ప్రతి ఏడాది జనవరి, ఆగస్టు నెలల్లో నర్సరీ మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అనేక రకాల మొక్కలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇంటి స్థాయిలో గార్డెనింగ్‌ను ప్రోత్సహించేందుకు మేళా దోహదపడుతుందని తెలిపారు.

ఆగస్టు 27 నుంచి 31 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే మేళాలో 110కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ముంబయి, బెంగళూరు, పుణే, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చారు. నాగాలాండ్‌కు చెందిన కాక్టస్ వంటి ప్రత్యేక మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి.

టెర్రస్, వెర్టికల్, హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కు అవసరమైన మొక్కలతో పాటు పూలు, ఔషధ మొక్కలు, బోన్సాయి, అలంకరణ మొక్కలు మేళాలో లభిస్తున్నాయి. రూ.20 నుంచి రూ.2.5 లక్షల విలువైన మొక్కల వరకు వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మొక్కల పెంపకానికి అవసరమైన మెటీరియల్స్, సేంద్రియ ఎరువులు, ఫెర్టిలైజర్లు, టెర్రకోట కుండీలు తదితర సామగ్రి కూడా ఒకే చోట లభించడం మేళా ప్రత్యేకత అన్నారు.

మొక్కలు ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడతాయని తుమ్మల పేర్కొన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచడం వల్ల చల్లదనం, మానసిక ఉల్లాసం కలుగుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరవాసులు ఐదు రోజుల పాటు జరిగే నర్సరీ మేళాను సందర్శించి మొక్కలను కొనుగోలు చేసి ఇళ్లను పచ్చదనంతో నింపాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text