#విలేజ్ నుంచి గ్లోబల్‌కు ఒగ్గుడోలు సంస్కృతి
క్రికెటర్లు, ప్రేక్షకుల్లో ఉత్సాహం
#ఒగ్గుడోలుకు న్యూట్రెండ్
ఐపీఎల్‌లో హోరెత్తిస్తున్న ఒగ్గుకళాకారులు
యువతలో క్రేజ్
హైదరాబాద్, ఏప్రిల్ 20
ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన ఒగ్గుడోలు సంస్కృతి ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతోంది.కొత్త వేషధారణతో న్యూట్రెండ్ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ను నింపుతోంది. ఒకప్పుడు ఒగ్గుకథతో చుక్క సత్తయ్య ప్రజల హృదయాలను గెలిచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆయన మనవడు ఉస్తాద్ ఒగ్గు రవి చుక్క సత్తయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడితో ఒగ్గుడోలుతో న్యూట్రెండ్ కొనసాగిస్తున్నాడు..

వరల్డ్ ఫేమస్ గేమ్ క్రికెట్ టీ 20, ఐపీఎల్ మ్యాచ్లలో ఒగ్గు డోలు వాయిద్యాలతో క్రికెట్ స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లు బ్యాట్స్మెన్ సిక్స్ లు, ఫోర్లు బాదుతుంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపడానికి చీర్ గర్ల్స్ డ్యాన్స్ లు చేయడం చూశాం. ఇప్పుడు కొత్తగా ఒగ్గు డోలు క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టింది.

సన్ రైజర్స్ ప్రోత్సహంతో స్టేడియంలోకి ఒగ్గుడోలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈసారి భిన్నంగా తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఛీర్ గర్ల్స్ స్థానంలో తెలంగాణ గ్రామీణ కళారూపమైన ఒగ్గుడోలు కళాకారులకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లోఒగ్గుడోలు ప్రదర్శనలో తెలంగాణ ఒగ్గు కళాకారులకు అవకాశం దక్కింది. దీంతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రామీణ కళారూపం, కురుమల సంస్కృతి, వారసత్వమైన ఒగ్గుడోలు ప్రదర్శన ఐపీఎల్ మ్యాచ్ లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆడే మ్యాచ్‌లలో ఒగ్గుడోలు ప్రదర్శన హోరెత్తిస్తోంది. ప్రముఖ ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ ఒగ్గు రవి సారథ్యంలో 20 మంది ఒగ్గు కళాకారులు స్టేడియంలో ఉర్రూతలు ఊగిస్తున్నారు.
ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఒగ్గు కళాకారులు తమ ఒగ్గుడోలుతో విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆటు టీవీక్షకులను ఆకట్టుకున్నారు. జట్టు టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు కళాకారులు తమ డోలుతో ప్రత్యేక ట్యాన్లతో వాయిస్తుంటే ప్రేక్షకులు, ఆటగాళ్లు సైతం వాటి లయకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండడం కొత్త ట్రెండ్ గా మారింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే క్రీడాకారుడు సిక్స్‌లు, బౌండరీలు కొట్టినప్పుడు, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ సమయంలో ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు ఒగ్గు డోలు కళాకారులు డోలుతో అదరగొడుతూ స్టేడియంలో కొత్త శబ్ధాలతో హోరెత్తిస్తున్నారు. చీర్‌గర్ల్స్ డ్యాన్స్ లకు భిన్నంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ప్రేక్షకుల్లో క్రేజ్ సృష్టిస్తోంది.




ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కురుమల బీరప్ప పెద్దపండుగలు, కొలుపులు, యాదవుల లింగమంతుల ఉత్సవాలు, హైదరాబాద్ మహాంకాళీ బోనాల ఉత్సవాలు, పెండ్లిళ్లు, జాతరలో మాత్రమే కనిపించే ఒగ్గు డోలు నృత్యాలు నేడు క్రికెట్ స్టేడియంలో డమరుకాలు మోగి విశ్వవాప్తం అవుతున్నాయి.
విలేజ్ నుంచి గ్లోబల్ కల్చర్‌గా పరిచయం చేస్తున్నాం
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒగ్గుడోలు ప్రదర్శనలు ఇచ్చాం. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో మొదటిసారిగా ఒగ్గుకళను ప్రదర్శించే అవకాశం దక్కింది. ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్లోనూ ఒగ్గుకళా రూపాలు, డోలు వాయిద్యాలతో ప్రత్యేకంగా నిలిచాం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున హైదరాబాద్‌లో ఆడే అన్ని మ్యాచ్‌ల్లో తాము ఒగ్గుడోలు ప్రదర్శన ఇచ్చాం. ఐపీఎల్‌లో ఒగ్గుడోలు కళా ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, సన్‌రైజర్స్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. పద్మశ్రీ చుక్క సత్తయ్య నాడు ఒగ్గు కథతో ప్రజల్లో అనేక అంశాలపై ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ నేడు ఒగ్గు డోలును విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.

ఉస్తాద్ ఒగ్గు రవి, ఒగ్గు కళాకారుడు, హైదరాబాద్